పుట:Andhra bhasha charitramu part 1.pdf/848

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నది. ఈ వ్యుత్పత్తి యీనాటిపారిచెవులకు గటువుగా నుండవచ్చును గాని, 'కూతురు' మొదలగుపదముల వ్యుత్పత్తులనువలె దీనినిగూడ సహించుకొనవలసియుండును. 'విధవ' యనగా మగడు లేనిది. పెండ్లి కాని కన్యయు, మగడు గతించిన స్త్రీయును విధలే యగుదురు. కన్యక విధవయే కావున నామెకు సౌమంగల్యవిధాన మొనర్చుట * 'అవిధవాకరణ' మని సంస్కృత గ్రంథముల గానవచ్చుచున్నది. భాసకృత "స్వప్నవాసవదత్తము" తృతీయాంకమున 'అవిధవా కరణం' అని యొక చోటను, 'అవిధవాభి:' అని యొక చోటను బ్రయోగించియున్నాడు. కాళిదాసు "మేఘసందేశము"న 'అవిధవే' అని వాడినాడు. "నాగానందనాటకము"నను 'అవిధవా' శబ్దము కనబడు చున్నది. ఈ 'అవిధవా' శబ్దము వేదకాలమునుండియు వచ్చుచున్నదిగాని క్రొత్తగ గల్పించినదికాదు. ఋగ్వేదఖిలభాగమున నీ పదమున్నట్లు నిఘంటువులు చెప్పుచున్నవి. తైత్తిరీయబ్రాహ్మణము.(3. 7. 5)లో 'ఇంద్రాణీ వావిధవా భూయాసం, అదితి రివ సుపుత్రా (భూయాసమ్)' అని యున్నది. ఇట్లే అదేగ్రంథమున (3. 5. 13)'ఇంద్రాణీ వావిధవా అదితిరివసుపుత్రా' అని యున్నది. దీనికి భాష్యవివరణమున 'ఇంద్రస్య పత్నీంద్రాణీ, నా కదాచిదపి విధవా న భవతి; తద్వ దహ మపి యావజ్జీవ మవిధవా భూయాసమ్‌' అని యున్నది. కావున, 'అవిధాకరణము' అను ప్రయోగమునుబట్టి కన్యకకు విధవాత్వమును, పతిగతించిన స్త్రీకి 'అహమవిధవా భూయాసమ్‌' అను ప్రయోగమునుబట్టి విధవాత్వమును సిద్ధించుచున్నవి. కాని, వ్యవహారమున విధవాత్వము భర్తృవియోగము నొందిన స్త్రీకే చెల్లుచు వచ్చినది. 'అవిధవా' శబ్దము మాత్రము ప్రాకృతద్వారమున తెనుగున 'అయిదువ' అను పదమున నిలిచియున్నదని చెప్పవచ్చును.

ఆంధ్రభాషా పరిశోధనమున నిప్పటి యవస్థయం దనేకపదముల వ్యుత్పత్తిని నిర్ణయించుట కష్టసాధ్యము. పదములపోకడ లనేకరీతులుగ నుండును. వానినన్నిటిని సప్రమాణముగ నిరూపించుటకు జాల పరిశోధనము కావలసి యుండును. శబ్దరత్నాకరకారుడు తెలిపిన కొన్నిపదముల వ్యుత్పత్తులు విద్వాంసుల విమర్శకొఱ కీక్రింద నీయబడినవి.

అడియాలము = అడి + ఆలము = గుఱుతు, చిహ్నము (అలశబ్దమున కిక్కడ స్థానమర్థము); అడువ = అడుగు + పట్టినది; అరమర = అర + మరలుట; అఱవము = అఱ + వాయి; అఱ్ఱాడు = అఱ్ఱ + ఆడు; అల్లుడు = అల్లు + వాడు; ౙలగిరి = ౙలగడుగు + అరి; ౙలగడుగు = ౙలకము +


  • ఈ ప్రయోగములను నెల్లూరువాస్తవ్యులు మ. రా. రా. ఒంగోలు వెంకటరంగయ్య, బి. ఏ, బి. ఎల్. గారు నాకు తెలిపియున్నారు. వారికి గృతజ్ఞుడను.