పుట:Andhra bhasha charitramu part 1.pdf/784

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(5) ద్వంద్వసమాసమున తక్కువ యచ్చులుగలది పూర్వపదమగును: శివకేశవులు. 'శివ' అనుపదములో రెండచ్చులున్నవి; 'కేశవ' అనుదానిలో మూడున్నవి; కావున 'శివ' అనునది పూర్వపదమగుచున్నది.

సమాసమున తక్కువ యచ్చులుగల యనేక పదము లున్నప్పుడు వానిలో దేనినైనను బూర్వపదముగా వాడవచ్చును: శంఖదుందుభివీణలు; వీణాశంఖదుందుభులు.

'ఋతువులయు' నక్షత్రములయుపేళ్లు సమానసంఖ్యగల యచ్చులను గలిగియున్నప్పుడు వానిని అనుపూర్వ్యముగ నుపయోగింపవలెను: హేమంతశిశిరవసంతములు; కృత్తికారోహిణులు. సమానసంఖ్యగల యచ్చులు లేనపుడీ నియమము లేదు: గ్రీష్మవసంతములు.

సమానసంఖ్యగల యచ్చు లున్నపదములైనను వానిలో లఘ్వక్షరములు గలపదమును మొదటవాడవలెను: కుశకాశములు.

ఎక్కువ గౌరవమును దెలియ: జేయు పదమును మొదటవాడవలెను: తాపసపర్వతులు, వాసుదేవార్జునులు.

వర్ణముల పేళ్లను యథాక్రమముగ నుపయోగింపవలెను. బ్రాహ్మణ క్షత్రియులు, క్షత్త్రియవైశ్యులు, విట్శూద్రులు.

అన్నపేరిని తమ్ముని పేరిక ముందుగా నుంచవలెను; యుధిష్టిరార్జునులు.

(6) ప్రాణులు, తూర్యములు, సేన - వీనియంగములను దెలియజేయు పదములు ద్వంద్వసమాసమున జేరునపు డాసమాస మేకవచనమందే యుండును: పాణీవాదము, శిరోగ్రీవము, మార్దంగికపాణవికము, వీణావాదక పరివాదకము, రధికాశ్వారోహము, --------తము.

ఇట్టి యేకవచనత్వము సమాహారద్వంద్వసమాసములకే వర్తించును; ఇతరేతరద్వంద్వములకు వర్తింపదు. పై యుదాహరణములవంటివి కేవల సమాహారద్వంద్వములు. 'దధిపయస్సులు' మొదలగునవి కేవలము నితరేతర ద్వంద్వములు; వానికేకవచనత్వము కలుగదు. వృక్ష, మృగ, తృణాదులను దెలియజేయు పదముల ద్వంద్వసమాసము వైకల్పికముగా నేకవచనమందుండును. కావున నవి సమాహారద్వంద్వములుగాని, యిత రేతరద్వంద్వములుగాని కావచ్చును.

(7) ప్రాణివాచకములుగాని జాతులను దెలుపు పదముల ద్వంద్వసమాస మేకవచనమందుండును; ఈ జాతుల ద్రవ్యవాచకములై యుండవలెను: ఉదా. ధానాశష్కులి.