పుట:Andhra bhasha charitramu part 1.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధించి యుండినయెడల నా యా భాషలు పరస్పరసంబంధము గలవని చెప్పవచ్చును. ఈవిషయమున సర్వనామములును, సంఖ్యావాచకపదములును ముఖ్యములు. రెండుభాషల యక్షరములందు (ధ్వనులయందు) సామాన్య పరిణామము కాన్పించుచున్నయెడల, నా భాషల నిర్మాణవిషయమున సాదృశ్యము కాన్పించు చున్నయెడల, నా భాషలకు బరస్పరసంబంధము గలదని నిశ్చయముగ జెప్పవచ్చును.

ఈయభిప్రాయము ననుసరించి రాస్కు ఆర్యభాషా కుటుంబమున నంతర్భాగముల నేర్పఱిచెను. ద్రావిడభాషలకును సంస్కృతమునకును సంబంధములేదని మొదట తెల్పిన యాత డీతడే. గ్రిమ్ (Grimm), బాప్ (Bopp) లాయాభాషల విషయమున సూక్ష్మ విమర్శనములుచేసి, కొన్ని ధ్వని పరిణామ సూత్రముల నేర్పఱిచిరి. బాప్ (Bopp) భాషల నన్నిటిని మూడు వర్గములుగ నేర్పఱిచెను. (1) ధాతువులుగాని ప్రత్యయములుగాని లేని భాషలు: ఉదా. చీనాభాష. ఇట్టిభాషలయం దాయాపదములు వాక్యమునందున్న స్థానమునుబట్టి యర్థస్ఫూర్తి కలుగును. (2) ఏకాక్షర ధాతువులుగల భాషలు: ధాతువు లితర ధాతువులతో జేరి వివిధ వికారములను బొందుటచేత వివిధ వ్యాకరణ రూపము లేర్పడును: ఉదా. సంస్కృతము, మొద. (3) ద్వివర్ణక ధాతువులు గల భాషలు, లేక మూడు వ్యంజనములుగల ధాతువులు మూలముగా గల భాషలు: ఉదా. అరబ్బీ, హీబ్రూ, మొదలయిన సెమిటికు భాషలు. ఇం దాయా వ్యంజనముల యంతరమున వివిధాచ్చులుచేరి వ్యాకరణరూపము లేర్పడుచుండును. ఈ విభాగమును గూర్చి తరువాతి కాలమున నభిప్రాయ భేదము లేర్పడెను.

పై వారితరువాత భాషాశాస్త్రమున బేరుగడించినవాడు హుంబోల్టు (Wilhelm von Humboldt). ఇతని యభిప్రాయము ప్రకారము భాష యొక వస్తువుకాదు; అది పరిపూర్ణత నొందినదికాదు. అది చైతన్యము. అది యూహలను దెలుపుటకు వాగింద్రియ మూలమున మనస్సు చేయుచుండు నిరంతరకృషి...భాష యేకము; ప్రత్యేకపదములును వాక్యములును భాష కా జాలదు. భాషను పదములుగ విభజించి సూత్రముల నేర్పఱుచుట యది మృతదేహ మనుకొని యిచ్చవచ్చునట్లు దానిని భేధించుటవంటిది. భాషలో నేదియు నిలుకడ గాంచియుండదు; అది చైతన్యవంతమై చలనాత్మకమై యుండును. భాష యొకచో నిలుకడ గాంచుటకు దావులేదు. అది వ్రాత యందును నిలువ జాలదు. అందు నశించిన భాగమును మనస్సునందు పున:స్సృష్టి చేసికొనుచుండవలెను. భాషయనునది భాషింపబడవలెను; ఇతరులకు బోధపడవలెను. లేకున్న దానికి వ్యక్తిత్వము లేకుండును. ఎంత యనాగరిక