పుట:Andhra bhasha charitramu part 1.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii. అసిబోవు, అసివచ్చు మొద.

ఇందలి 'అసి' విశేష్యముగాని, క్రియగానికాదు.

5. ఆరు:- ఆరుదూఱు, ఆరుదొండ, ఆరుపోరు:- ఇది 'కలుగు, నిండు' అనునర్థములు గల 'ఆరు' అను క్రియగాదు.

6. ఉడ్డ, ఉడ్డు:- ఉడ్డాడు, ఉడ్డాడించు, ఉడ్డగుడుచు. - ఇట్టి యర్థములందు దెనుగున నుడ్డయను పదములేదు.

7. ఉఱ్ఱ:- ఉఱ్ఱటలూగు, ఉఱ్ఱట్లూగు, ఉఱ్ఱూతలూగు:- ఇందు 'ఉఱ్ఱు' అనునది 'ఊగు' అనుక్రియకు సంబంధించినదికాదు. 'ఉద్‌' అను నుపసర్గమును బోలియున్నది.

8. ఉల్ల:- ఉల్లకుట్టు, ఉల్లడ, ఉల్లల:- ఇది 'ఉల్లము=హృదయము మనస్సు' అను శబ్దమునకు సంబంధించినదికాదు. 'ఉద్‌' అను నుపసర్గమును బోలియున్నది.

9. ఉవ్:- ఉవ్వాయి, ఉవ్విళ్లూరు, ఉవిళ్లుగొను, ఉవ్వు, ఉవ్వెత్తు:- ఇదియు 'ఉద్‌' అను నుపసర్గమును బోలినదే.

10. ఊచ:- ఊచముట్టు=విశ్శేషము.

11. ఎగ:- ఎగగొట్టు, ఎగగ్రోలు, ఎగజల్లు, ఎగజేపు, ఎగదన్ను, ఎగబట్టు, ఎగబాఱు, ఎగబోయు, ఎగబ్రాకు, ఎగదువ్వు, ఎగనూదు, ఎగనూకు, ఎగనెత్తు, ఎగరోజు, ఎగవిడుచు, ఎగవేయు, ఎగవైచు:- వీనిలో 'ఎగన్‌' అనునది 'ఎగు' ధాతువు తుమున్నర్థక రూపమైనను, నా ధాతువునుండి పుట్టినదను జ్ఞానము జనులయం దంతరించిపోవుచు దాని కుపసర్గభావ మంతకంతకు గలుగుచున్నది.

12. ఎద:- ఎడకట్టు=ఆఱినపుండు మఱల చీముపట్టు, చేర్చు; ఎడకారు=మాఘమాసము మొదలు జ్యేష్ఠమాసములోపల పండించెడు పంట; ఎడదవ్వు=అతిదూరము:- వీనికి 'ఎడము=అంతరము, అవకాశము అను నర్థములేదు.

13. ఏడ్:- ఏడ్గడ, ఏడ్తెఱ:- ఇది అతిశయార్థముగల 'ఏఱ్‌' అను ద్రావిడపదమైనను నాజ్ఞానము తెనుగువారికిలేదు.

14. ఒడ:- ఒడగూడు, ఒడబడిక, ఒడంబడిక, ఒడబడు, ఒడబాటు:- ఇది సహార్థమున నుపయోగింపబడును. తెనుగున నీ యర్థమున 'లోడు' శబ్దముగలదు. కన్నడమున 'ఒడం, ఒడనె, ఓడు' అనియు, తమిళమున 'ఒడం' అనియు నవ్యయములు గలవు. తెనుగున 'ఒడ' అనున దవ్యయమని స్ఫురింపదు.