పుట:Andhra bhasha charitramu part 1.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సించు, తళారించు, వెలారించుమొద. తద్భవ, దేశ్యశబ్దములందుండు సంయుక్తాక్షరములు సాధారణముగ నేకవర్ణద్విత్వములై యుండును. ఒకహల్లు వేఱుహల్లుతో సంయోగముగలిగి శబ్దమం దున్నప్పు డట్టి శబ్ద మర్థతత్సమమో, యన్యదేశీయమో యై యుండవలెను. ఉదా:- త్రస్తరించు, మస్తరించు, కుస్తరించు, మొద.

కొన్నియెడల నన్యదేశ్యవిశేష్యములకును 'ఇంచుక్కు' చేరి తెనుగున క్రియాప్రాతిపదికము లేర్పడును. ఉదా:- టూకించు (హిం. టూకీ), టాకించు (హిం. టాకా), రంగరించు, రంగలించు, రంగాయించు.

భారతీయార్యభాషలనుండికాక యితరమగు నిండో-యూరోపియను భాషలలో నింగ్లీషునుండి. తెను గెక్కువ శబ్దములను జేర్చుకొన్నది. ఆంగ్ల విశేష్యముల నెక్కువగ నాంగ్లవిద్య నభ్యసించినవారును, వారితో సంబంధముగలవారును, నాంగ్లప్రభుత్వముతో సంబంధముగలవారును నుపయోగించుచున్నారు. కాని యాంగ్లక్రియలు మాత్రము తెనుగున ధాతువులుగ జేరలేదు. ఇతరభాషాపదముల కించుక్క జేర్చి వాడుకొనునట్లు తెనుగువా రాంగ్లపదములకు జేర్చుటలేదు. అట్లాంగ్లపదములను వాడవలసినప్పుడు వానిని 'చేయు' ధాతువులతో జేర్చి వాడుకొనుచుందురు. ఎంజోయ్‌చేయు, ఎగ్జామిన్‌చేయు, మొద. ఇట్లే హిందూస్థానీపదములను వాడునప్పుడును 'చేయు' ధాతువనుప్రయుక్త మగుచుండును. ఉదా:- రవానాచేయు, మాఫీచేయు, మొద.

II. 3, 4, సమస్తధాతువులు, ప్రత్యయసహితధాతువులు, ధ్వన్యనుకరణధాతువులు, వీనిపట్టికలు మఱియొకచో నియబడినవి.

II. 5. సందేహాస్పదములు, నష్టధాతువులు:

కా, కద, కదా, పద, పదము, పదడు; ఇంద, ఇందము; ఊరక; మిన్నక; లేదు; కావున, కాన - ఈ మొదలగురూపములకును, పొరి, ఒగి, మొదలగు నవ్యయములకును, నిట్టివే మఱికొన్నిటికిని రూపము లసాధారణములుగ నున్నవి. వీనిలో గొన్నిటికి ధాతువు లున్నట్లు గానవచ్చినను నా ధాతువులనుండి యారూపము లెట్లు కలిగినవో తెలుపుట కష్టము. వానిని గూర్చి తెలిసికొనుటకు బ్రాకృతభాషలయు, ఇతర ద్రావిడభాషలయు, సాహాయ్య మావశ్యకమగును.

కొన్నిధాతువులు సంస్కృత ధాతురూపములతోడనే యున్నను వానిని దేశ్యములుగ బరిగణించుచున్నారు: ఎడయు (బం. ఏత్, సం. ఏడి); నడచు (బం. నట్, సం. నడ్, ప్రా. ఇ. ఆ. నృత్; ప్రా. నట్, నడ్); కుదియు (బం. కుద్, సం. కూర్ద్); ముడుచు (-గు), ముడియు (బం. మఱ్, సం.