పుట:Andhra bhasha charitramu part 1.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పించిన శబ్దశాస్త్రజ్ఞుల మార్గము ననుసరించినదే కాని, ద్రావిడభాషలకు బ్రత్యేకముగ నేర్పఱిచినది కాదని గ్రహింపవలెను.

1.-కు.

ఇది సంస్కృతమందలి 'కృ' అను ధాతువునుండి పుట్టినది. ఉత్త్రర హిందూస్థాన భాషలలోని 'క' కారాంత ధాతువులు నిట్లే యేర్పడినవి: ఉదా. హిందీ: ధ్యాన + కృ = ఝాంక్ కొన్నియెడల 'కృ' ధాతువునకు 'ను' వికరణ సంజ్ఞజేరి 'కృణు' అయి, 'కొను' గా తద్భవమయి, సహాయ ధాతువుగా నేర్పడి, యర్ధానుస్వారయుక్తమగు 'కు' వర్ణకముగా మాఱినది. తాకొను, తాకు: తలకొను, తలకు: మునుకొను, మునుకు మున్నగునట్టివే. 'కు' వర్ణక మర్ధానుస్వారయుక్తమగుటకు దానితో సంస్కృతమునందో ప్రాకృతమునందో యనునాసికధ్వని యొకటి యుండుటయే కారణమయి యుండును.

ఉదాహరణములు.

1. అనునాసికము + కృ: యమ్ + కృ = ఈకు.
2. అనునాసికము + హల్లు + కృ: కృంత్ + కృ = గీకు; భింద్ + కృ = పీకు.
3. అనునాసికముగా మాఱు స్వభావముగల హల్లు + కృ: కృశ్ + కృ = కెలకు; స్తృ + కృ = తొరకు, తొలకు, తొనకు; తృట్ + కృ = తొడకు, తొలకు, తొణకు; సాధ్ + కృ = సాకు.
4. ధాతువు + 'ను' వికరణ సంజ్ఞ + కృ: ధూను + కృ = దూకు.
5. క్రియాజన్య విశేషణము + కృ: భీత + కృ = బెడకు, బెళకు, వడ (ణ)కు.
6. ఉపసర్గము + కృ: ఉద్ + కృ = ఊకు.
7. అవ్యయము + కృ: సీత్ + కృ = చీకు; ధూత్ + కృ = డోకు.

2.-౦కు.

1. అనునాసికము + కృ: యమ్ + కృ = ఇంకు.
2. అనునాసికము + ఇతర హల్లు + కృ: న్యఞ్చ్ + కృ = నంకు.
3. ఉపసర్గము + కృ: ఉద్ + కృ = ఉంకు.
4. అనునాసికముగ మాఱు స్వభావముగల హల్లు + కృ: అధస్ + కృ = డుంకు, డొంకు.