పుట:Andhra bhasha charitramu part 1.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డములో గ్రియ విశేష్యతుల్యమై యున్నది. ద్రావిడభాషలలోని లకారములు క్రియావిశేషణము నుండి జనించినవి. ఆర్యభాషా వికాసమునం దిండో-యూరోపియను సంపూర్ణక్రియారూపము లంతకంతకును లోపించి వానిస్థానమున క్రియావిశేషణ రూపములుచేరుట కాననగును. సంస్కృతములో కరిష్యతి యనుటకు కర్తా అనుటయు, కరిష్యామి అనుటకు కర్తాస్మి యనుటయు ద్రావిడభాషా వ్యవహారము ననుసరించి యున్నది. వైదికభాషలో సకృత్తుగా గాన్పించు తవన్త్ ప్రత్యయము ద్రావిడభాషలలోని దవన్ ప్రత్యయమును బోలియున్నది.

ఉదాహరణము:- సంస్కృతము: కృత, కృతవంత్; తమిళము: శెయ్‌దు, శైదవన్. ఆధునిక మగధభాషలగు బంగాలీ, ఒఱియా, మైథిలీ, మగహీ, భోజపురియా, భాషలయందు క్రియల లజ్, లుట్, రూపము 'ధాతువు + భూత, లేక, భవిష్యత్క్రియాజన్య విశేషణము + సర్వనామప్రత్యయము'గా నుండుట ద్రావిడభాషలయందువలె నున్నది. క్రియల క్త్వార్థకరూపములతో సంపూర్ణక్రియలనుచేర్చి వాడుట యాధునికార్య ద్రావిడభాషలకు సామాన్య లక్షణము.

ఉదాహరణములు:- తమిళము: కొండువా; బంగాళీ: వైయా ఆఇ స=నీఏ ఏసో; హిందీ: లాఓ = లే + ఆఓ. ఈ నుడికార మార్యభాషలకు ద్రావిడమునుండి సంక్రమించియుండును.

ప్రాచీనార్యభాషలలోని కర్మణి ప్రయోగమాధునికార్యభాషలలో జాలవఱకు నంతరించినది. దానికిబదులుగ నేటి యార్యభాషలలో ద్రావిడమునందువలె 'పోవు, పడు, పట్టు, పెట్టు, తిను' అను నర్థములనిచ్చు ప్రత్యేక ధాతువు లుపయోగమున నున్నవి.

(5) ఆధుని కార్యభాషలయందును ద్రావిడభాషలయందును ధ్వన్య నుకరణశబ్దము లనేకములున్నవి. వైదికభాషయం దిట్టివి చాలనరుదు. ఇవి ప్రాకృతావస్థనుండియు నానాటికి నధికమగుచు వచ్చినవి. ధ్వన్యనుకరణ శబ్దములు కోలుభాషలయందును నెక్కువగనున్నవి. బహుశ: ఈ విషయమున కోలుభాషల సంపర్కమును నార్యభాషలకు గలిగియుండును.

(6) రెండుకుటుంబముల యందును 'ప్రతిధ్వనిశబ్దము' లెక్కువగ వాడుకలో నున్నవి. శబ్దమునకు బాక్షికముగ బునరుక్తికలుగును.పునరుక్త పదము నాద్యక్షరములు నియతముగనుండును. పునరుక్తపదమర్థరహితమైన దైనను మొదటిపదమునకు 'మొదలగు', 'పోలిన', 'సంబంధించిన' అను మొదలగునర్థముల గలుగ జేయుచుండును.