పుట:Andhra bhasha charitramu part 1.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపములను బొందుచుండ బైశాచీభాష తన లక్షణముల వీడకుండుట యాశ్చర్యకరముగ నున్నది. వేదములలో దప్ప నిండియాదేశములో మఱి యెచ్చటను గానరాని కొన్నిశబ్దములు నేటి పైశాచీ భాషలయందు చెక్కు చెదరక నిలిచి యున్నవి.

పిశాచజాతులవారు సింధునదీమార్గమున నేటి సింధుదేశము వఱకును వ్యాపించినట్లు తెలియు చున్నది. అశోకచక్రవర్తి వ్రాయించిన శిలా శాసనము లాయాప్రాంతముల వ్యవహారము నందున్న భాషయందున్నవి. నేటి యూసుఫ్ జాయి దేశము నందలి షాబాజుగడీ యొద్దనున్న యశోకుని శాసనములందలి భాష పైశాచీభాషా రూపమును బ్రకటించు చున్నది.

5. ఇక నిండియాదేశమును బ్రవేశించిన ఇండో-ఆర్యభాషల చరిత్రమును గమనింతుము. ఈ భాషాస్వరూపము మనకు వేదములనుండి స్పష్టపడు చున్నది. వేదమంత్రము లన్నియు నొక్కటే ప్రదేశమున రచింప బడినవి కావు. ఆఫ్‌ఘనిస్థానము నుండి యమునానదీ తీరమువఱకును గల ప్రదేశము నందవి రచింప బడుచు వచ్చినవని పరిశోధకుల యభిప్రాయము.

ఆర్యులందఱు నొక్కసారిగ భరతవర్షమున బ్రవేశింపక తెర తెరలుగా వచ్చినట్లు తెలియుచున్నది. వీరిలో మధ్యదేశము నందలి యార్యులు వింధ్య పర్వతమువఱకును వ్యాపించిరి. ఈ మధ్యదేశమునందలి యార్యభాషలన్నియు నొక్కటే లక్షణమును గలిగి యున్నవి. ఈ మధ్యదేశము చుట్టును మఱికొన్ని ప్రాకృతభాష లావరించుకొని యున్నవి. మధ్యదేశ భాషలకును వానిని చుట్టుకొనియున్న భాషలకును కొన్నిముఖ్యములగు భేదము లున్నవి. మధ్యదేశ భాషలయందు శషస లు, సకారముగా మాఱినవి. చుట్టునున్న భాషలను మాట్లాడువారు సకారమును బలుకలేరు. సకార మీ భాషలలో గొన్నిటియందు షకారముగను, గొన్నిటియందు హకారముగను మాఱినది. మధ్యదేశీయ భాషలలో సంస్కృతములోని నుప్పులు లోపించి, ఆ ప్రత్యయముల స్థానమున వేరుశబ్దములే యుపయోగింప బడుచున్నవి. ఈ శబ్దములు తమప్రత్యేక శబ్దత్వమును విడనాడి కేవల ప్రత్యయములుగ మాఱలేదు. చుట్టునున్న భాషలయందుగూడ నిట్లే సుప్ర్పత్యయములు లోపించి, వాని స్థానమున బ్రత్యేక శబ్దములు వాడుకలోనికి వచ్చినను, ఆశబ్దములు తిరిగి ప్రత్యయములుగ బరిణమించుట సంభవించినది.

తిజ్ విషయమునగూడ నీరెండు వర్గముల భాషలకును ముఖ్యము లయిన భేదములు గలవు. ప్రాచీన సంస్కృతము లోని లజ్‌రూపములు లోపించినవి. సాధారణముగ క్రియల లడ్రూపములు వేర్వేరుభాషలయం దర్ధభేదమును బొందినను నిలచియున్నవి. పూర్వకాలపు లుట్ లృట్ రూపములు