పుట:AndhraRachaitaluVol1.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు "నీవా నేనా" యని చేయగల శ్రీ రామశాస్త్రిగారు చాలకాలము దాక తెలుగు నెరుగరుట యొక రహస్యము. గిడుగువారి వాద శంఖనాదములు చెవులబడి ఆంధ్రభారతము తీరెట్లుండునో యని చదువ నారంభించిరి. అదియాది, యాగస్తివలె యావదాంధ్ర వాజ్మయ మహోదధిని రామశాస్త్రిగా రాపొశనించిరి. దాని ఫలమే "ఆంధ్ర మహాభారత విమర్శనము". ఇది 500 పుటలు పైబడిన కూర్పు. ఉద్యోగ పర్వ విమర్శనము మాత్రమే యచ్చువెలుగు చూచినది.

ఆంధ్రశబ్దచింతామణిపై "ఉద్ద్యోతిని" అను గొప్ప వ్యాఖ్యా గ్రంథము వీరు చరించిరి. శ్రీ వీరేశలింగము పంతులుగారు చింతామణి నన్నయ కృతము కాదనగా, ఆ వాదము సరిగాదని రామశాస్త్రిగారు సోదాహరనముగా నన్నయకృతమే యని నిరూపించిరి. ఇది తెలుగులో వీరి తొలిరచన. జంకులేని విద్వాంసులగుటచే, వీరేమి వ్రాసినను స్వాతంత్ర్య రేఖలు స్పష్టముగ గోచరించును. "జ్ఞ" యను వర్ణము కంఠ్యమా, తాలవ్యమా యని విషయమును జర్చించుచు గొప్ప విమర్శనము వెలువరించిరి. వీరి విమర్శన రచన లెన్నియో "భారతి" ప్రభృతి పత్రికలలో బ్రచురితములు. వీరి సంస్కృతరూపక రచనకు దోహదము చేసిన మహనీయులు పర్లాకిమిడి ప్రభువుల పిన్నతండ్రియగు నొక రాజుగారు. ఆయన గీర్వాణ వాజ్మయాభిరుచి పెద్దగా గలవాడని ప్రసిద్ధి.

ధర్మశాస్త్రముపై రామశాస్త్రిగారికి మంచి యభినివేశము. నిరంతరము ధర్మగ్రంథావలొకనముతో గాలక్షేపము చేసి, మహావ్యాఖ్యాతగా, విమర్శకుడుగా బేరందిన పారనంది పండితుడు తెలుగుభూమిలో దాగిన చిరత్న రత్నము.