పుట:AndhraRachaitaluVol1.djvu/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారి జనకులు గొప్ప సంస్కృతాంధ్ర విద్వాంసులు. వారంధులు. తొలుత దండ్రిగారికడనే మన శాస్త్రిగారు విద్యాభ్యాసము గావించిరి. తరువాత విజయనగరమున బెక్కునాళ్లు పఠించిరి. 1877 లో బెజవాడ కడనున్న కొండపల్లి మిషన్ హైస్కూలులో నధ్యాపకులు. తరువాత రాజమహేంద్రవర పాఠశాలలో వడ్డాది సుబ్బారాయ కవిగారి స్థానమున 1884 వరకు బనిచేసిరి. పిమ్మట అమలాపురము హైస్కులులో 1889 లో బ్రవేశించి 1906 వరకు నుండిరి. అటు తరువాత పిఠాపురాంగ్ల పాఠశాలయం దాంధ్రాచార్యులై, తదాస్థానమున నాంధ్ర గ్రంథ పరిశోధన వ్యాఖ్యాతలై శ్రీ సూర్యరాయాధిపతులచే పరిపోషింపబడిరి. పిఠాపుర సంస్థానమంత్రి శ్రీ మొక్కపాటి సుబ్బారాయుడుగారు వీరికి బరమమిత్రము. సుబ్బారాయుడుగారు మల్లయ్య శాస్త్రిగారి కడ సూత్రభాష్య మధ్యయనించిరి. పోలవరాధీశులు కొచ్చెర్లకోట వేంకట కృష్ణారావు బహుద్దరువారు మల్లయ్యశాస్త్రి గారికి శిష్యులు. శాస్త్రిగారికి ఆముక్తమాల్యదపై నెక్కువ యభిమానమనియు, వీరి మురారిపాఠము వినదగిన దనియు బెక్కురు చెప్పుదురు. వీరి సంభాషణము విచిత్రతరమై హాస్యప్రచురమై యుండెడిదట.

చిలకమర్తి లక్ష్మీనరసింహకవి మల్లయ్యశాస్త్రిగారి మేనల్లుడు. అచ్చముగా, ఆయన మాటచాలిక మేనమామ పోలికయే. ప్రసన్న యాదవ నాటకములో చిలకమర్తికవి యిటులు ప్రస్తావించెను.

గీ. శ్రీపురాణపండ కులాబ్ధి శీతికరుడు
నరసు డాంధ్రగీర్వాణ భాషావిదుండు
మల్లయార్యుండు నామేనమామ యగుట
గవిత యెటులున్న కీకృతి గణుతిగాంచు.

పురాణపండ పండితుడు ఆంధ్రసూత్రభాష్యము వలన నవినాశమగు యశము సంపాదించుకొనిన రచయిత.