పుట:AndhraGuhalayalu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక స్తంభ మండపము గలదు. కేంద్ర దేవగృహానికి కూడ ప్రత్యేక స్తంభ మండపము గలదు. ఉత్తరపు చిన్న దేవ గృహమందే ద్వార పాలురు గలరు. ఇచటి దేవ గృహాలు, మండపాలు ఎల్లోరా గుహాలయములను పోలి యున్నవి. మెదటి అంతస్తుకు గ్రౌండ్ ప్లోర్ నుండి మెట్లు లేవు. కాని మొదటి అంతస్తు నుండి పై అంతస్తుకు మెట్లు గలవు. దీనిని బట్టి గ్రౌండ్ ప్లోర్ ఇచటి దేవ గృహలలో మలి దశకు చెందినదై వుండ వచ్చునని చెప్ప వచ్చును.

రెండవ అంతస్తులోని దేవ గృహ ఉత్తర దక్షిణాలుగా వున్నది. మొదటి అంతస్తు దేవ గృహము వలె తూర్పు పడమరలుగా లేదు. ఇచటి స్తంభ మండపము 50 అ॥ పొడవు 28 అ॥ వెడల్పు గలిగి యున్నది. దేవ గృహము 12అ॥ పొడవు, 13 అ॥ 9 అం॥ వెడల్పు గలిగి యున్నది. ఈ పరిణామముల వలననే ఇది ఉత్తర దక్షిణాలుగా శిలాఖండ పరిమితి వలన రూపొందించ వలసి వచ్చెను. ఇచటి దేవగృహలో అనంత శాయి విష్ణు ప్రతిమ తూర్పు పడమరులుగా రూపొందించబడి ఉత్తర కుడ్యము దగ్గరలో వున్నది.

ఇది పల్లవ రీతి గుహగా భావించ బడుచున్నప్పటికీ ఇది పల్లవేతర గుహలైన ఔరంగాబాద్ బౌద్ధ గుహాలయములను కొంతవరకు పోలియున్నది. పల్లవ మహేంద్ర వర్మ తరువాతి కాలమునకు చెందిన మహాబలి పురమందలి మహిష మర్థిని గుహాలయముతో పోల్చుటకు ఇది సరిపడుట లేదు. కాని ఇచటి మండప, దేవగృహ, స్తంభముల సింహాలు (ఒక పాదము పైకి యుండుట) మహేంద్ర వర్మ తరువాతి రీతి నిర్మాణాలుగా సూచించును. మూడవ అంతస్తులోని గుహ ముఖ భాగము (facade) లోని 'కూడిశాలా'(?) వరుసలు మామల్ల పూర్వ వాస్తు రీతిలో అగుపడవు. కాని పట్టడకల్, ఎల్లోరాలలో రాష్ట్ర కూట నిర్మాణాలలో వలె అగుపడును. దక్కన్ లోని ఇట్టి గుహాలయాల వివరాల గూర్చి బాగా తెలిసినటువంటి, ఈ గుహాలయాల ప్రాంతాలను పాలించినటువంటి రాజ వంశజులు విష్ణు కుండినులు లేక తూర్పు చాళుక్యులై యుండవచ్చు.

ఆఖరిదైన పై అంతస్తు మూడు దేవ గృహాలను కలిగి యున్నది. భైరవ కోన గుహాలయాల స్తంభాలు వంటివి ఇచట మనకగుపడును.

ఇచటి కొండ పైననే అసంపూర్తిగా వదిలి వేయడిన నాలుగు గుహాలయాలు గలవు. వీటిలో ఒకటి మూడు దేవగృహలను మిగిలినవి ఏక దేవ గృహాన్ని కలిగి యున్నవి.

ఇవేగాక మహాబలిపురములోని అర్జున తపో సంఘటనలోని రథము వంటి దేవ గృహవలె ఇచట ఆరు (రథముల వంటి నిర్మాణములు) గలవు (10 వ చిత్రపటము చూడుము). బరువైన 'కపోత' (heavy roll comics) సాదా కుడ్య స్తంభాలు, 'కూడు 'లేక 'మకుర పంజర ' లతోబాటు 'అధిష్టాన ', 'కుముద ', 'వేదిక ', 'శిఖర ', 'కలశ ' విభాగాలను కూడ కలిగి యున్నవి. లింగ ప్రతిష్ఠాపన దేవ గృహాన చేయ బడి యున్నది.

భైరవకోన గుహాలయాలు

అత్యధికముగా ఇటుక, కలపలతో నిర్మింపబడు చుండిన నిర్మాణములతో బాటు అశోకుని కాలమందు భారత దేశమున మొట్టమొదటి గుహాలయాలు శిలలందు రూపొందించుట ప్రారభమైనది. అశోకుడు, అతని మనుమడైన దశరథుడు ప్రాంతీయమైన అతి కఠిన శిల (Quartzose -gneiss) యందు నిర్మించిన తొలి గుహాలయాలు గయ దగ్గర లోని బారాబర్, నాగార్జుని,సితామర్హి పర్వతమందు గలవు. వాటిలో సుదామ, లోమస్ రిషి గుహాలయాలు