Jump to content

పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరూపించినాను. కుమారా! నీ వంశము చాలాకాలం ఆంధ్రదేశాన్ని ఏలబోదు. కాని లోకోద్ధరణ చేయడంలో తనపాత్ర తాను నిర్వహించి సర్వాంధ్రంలో కలిసి పోతుంది. మీ వంశీకుడే ఒక మహాపురుషుడు కాకతీ భక్తుడు ముందు ఉద్భవించి సామ్రాజ్యం స్థాపిస్తాడు. నేను కొద్దిదినాలలో నీకు పట్టాభిషేకం చేసి హిమాలయాభిముఖుడనయి వెళ్ళిపోతాను. బుద్ధంశరణం గచ్ఛామి"అని తెలిపినాడు.

నాగార్జునదేవుడే ఒక దివ్వమూర్తంముంచి తాను అపర శైలాశ్రమమునుంచి దిగివచ్చి, సర్వరాజన్య సర్వ అర్హతాచార్య సర్వమహాపండిత ఋషి, కాపాలిక మహాప్రజా సమక్షంలో శాంతిమూలుని సర్వభూమండలానికి సార్వభౌమునిగా అభిషేకం చేసినాడు. కుసుమలతా సారసికాదేవులు ఇద్దరూ చెరి ఒక వైపున మహారాణులయి అధివసించినారు.

పాండ్యులు, చోళులు, కేరళులు, నాగులు, ఆభీరులు, మాళవులు, కోసలులు, వైదేహులు, వాసిష్ఠులు, మాఠరులు, చాళుక్యలు, సాలంకాయనులు, బృహత్పాలాయనులు, గాంగులు, మాగధులు, నేపాళులు మొదలగు మహారాజులు, రాజప్రతినిధులూ సార్వభౌమ పట్టాభిషేకానికి వేంచేసినారు.

ఉత్సవాలు దివ్యంగా జరిగినాయి. శాంతమూలుడు సార్వభౌముడు కాగానే వీరపురుషదత్త మహాప్రభువును బాసటగా ఇచ్చి అశ్వమును వదిలినాడు. ఆ అశ్వమును ఎవ్వరును పట్టుటకు సాహసించలేదు. వీరపురుషదత్తుడు లక్ష్మణునివలె, అర్జునునివలె సర్వదేశాలు దిగ్విజయంచేసి అశ్వాన్ని నడిపించుకొని వచ్చినాడు. వీరపురుసదత్త పార్థునకు బ్రహ్మదత్త కృష్ణుడు సారథి యాయెను.

వీరపురుషదత్తునకు బ్రహ్మదత్త దనకప్రభువు, భగవద్గీతయు, బ్రహ్మసూత్రాలు పాఠముచెప్పి వ్యాఖ్యానించినాడు. వీరపురుషదత్తుడు విజయపుర అశ్వముతో చేరగానే బ్రహ్మదత్తుని పాదాలకెరిగి “ప్రభూ! నేను తరించాను నాజన్మ పావనమయినది. కాని తన వ్యాఖ్యానంతో అద్వయమయిన సత్యం నాకు గోచరించింది. బౌద్ధగురువులయిన అర్హతాచార్యుల బోధకిప్పుడు సమసన్వయం కుదురుతున్నది” అని మనవి చేసికొన్నాడు. బ్రహ్మదత్తుని గీతావ్యాఖ్యానం బ్రహ్మదత్త భాష్యమని లోకంలో ప్రసిద్ధి వడసినది.

(2)

అనేక అగ్నిష్టోమాది క్రతువులొనరించిన శాంతమూలుడు వాజపేయమూ, అశ్వమేధ క్రతువుల నొనర్చినాడు. బ్రాహ్మణులకు అనేకాగ్రహరాలు, మహాదానాలూ, హిరణ్యకోటులు, గోసహస్రాలు, హయసహస్రాలు అర్పించినాడు. ఈ క్రతువులు కాగానే అర్షసంప్రదాయంగా సర్వభూచక్రానికి శాంతమూలుని చక్రవర్తిగా అభిషేకించినారు. బ్రహ్మదత్తప్రభువు తండ్రి, విజ్ఞానశ్రీ దేవదత్త మహర్షి వసిష్ఠులై అశ్వమేధ వాజపేయాదులు జరిపించి శాంతమూలుని చక్రవర్తిగా అభిషేకించినారు.

మహారాజు యువరాజుగా, విజయపుర మహారాజుగా వీరపురుషదత్తుని అభిషేకం

చేసేముందు వాసిష్ఠీ భట్టిదేవి నిచ్చి విజయపురంలో ఆఖండ వైభవంగా వివాహం చేసినారు. వారిరువురకూ యౌవరాజ్య పట్టాభిషేకం జరిగింది. మహోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మదత్తుడు ఆ ఉత్సవాలలో సంపూర్ణంగా నిమగ్నుడై ఉన్నాడు.

అడవి బాపిరాజు రచనలు - 6

217

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)