పుట:Ambati Venkanna Patalu -2015.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదిగేటి బిడ్డలాను పోడిసేటి పొద్దున జూసి
వొరిగేటి వీరుల మోము ఆ నింగి సుక్కల జూసి
పొద్దంతా భుజాన మోస్తావే.... పొద్దూక జోకొడుతుంటావే

ననుగన్న పల్లేతల్లి నా జిల్లా నల్లాగొండ
తిరగంగా ఊరూవాడా కనరాదు నీటిజాడా

కాళ్ళుజూసి సెప్పొచ్చయ్యో కంకణాల పెళ్ళోడాని
తాటికల్లు పాలూ నీల్లూ మొత్తమంతా ఫ్లోరిన్ మయమూ
కాలు జెయ్యి మెలికలు దిరిగేనే.... ఆ... శివ రామా ధనుస్సులాయేనే
నింగి తొంగి చూసినట్టు వంగి, వంగి నడిసే మాకు
రెండు కాళ్ళు ఈడ్చి, ఈడ్చి మోకాళ్ళ సిప్పలు అరిగే
కాళ్ళీడ్చే గాడిద బతుకాయె...యే.....మము జూసే దిక్కేలేదాయె ॥ననుగన్న॥

గలగలా గోదారమ్మ పొలిమేరా దాకకుంట
పరిగెత్తీ పరుగులెత్తీ పొంగి పొర్లి సంద్రంజేరే
మనమేమీ పాపం జేసినమో... ఈ... సుక్కనీటికి ఎక్కిళ్ళు బెడ్తీమి
బిరబిరా వచ్చీన క్రిష్ణా నల్లగొండ నడుమా జేరి
సంద్రమంటి సాగరులోన చెంగనాలు దోలుతుందీ
ఎన్నిరాల్లు ఏరుకొచ్చేనూ.... ఈ.. గుక్కెడన్నా గొంతుజేరంగా ॥ననుగన్న॥

ఈగ ముసిరి గడ్డల్లాంటి చక్రాల బండ్లను డొలిపి
ఉన్నొక్క చెయ్యి గూడ కాయగాసి కంతిదేలే
కనికరించే దేవుడు లేడయ్యో...మా.. ఉసురు దగిలి వొరిగి పోతారే
మూతి మీసం వచ్చినగాని అమ్మసంక దిగరాదాయె
వచ్చినోనికి పబ్బతి బట్ట ఒక్కసెయ్యి గదలక పాయె
పొగరు బోతు గడ్డను కుంటారే.... పోర్లు దండాలెన్ని బెడ్తున్నా

87

అంబటి వెంకన్న పాటలు