పుట:Ambati Venkanna Patalu -2015.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నన్న ఓయన్న...



అన్నన్న ఓయన్న రైతుకూలన్న
దేశప్రగతికి నువ్వు జీవ గర్రన్నా
సుక్కబొడవక ముందే పైరు పంటల్లోనా
సూర్యుడయ్యి పొడ్సినావ మాయన్నా
ఎక్కెక్కి ఏడ్చేటి పంటసేలను జూసి
గుండె సెరువయ్యిందా రైతన్న
నీ గుండె సెరువయ్యింద రైతన్నా...
నువులేక రాజ్యానికి ఓరన్న
నిండుదన మేడుందిరా మాయన్నా
నువుబోతే దేశానికి ఓరన్న
కూడేసే దిక్కేదిరా మాయన్న ॥అన్నన్న ఓయన్న॥

అడుగూ అడుగున జూసి నేలతల్లిని బీల్చి
పాలు లేవని తెల్సి తల్లిరొమ్మును కొరికే
పసి పిల్లల పాట్లాయెనా ఓరన్నా
సాప్పిల్లల గోసాయెనా మాయన్నా
నీరింకి నిలబడితిరా ఓరన్న
కన్నీటి కాల్వయితిరా మాయన్న
కన్నీటి కాల్వయితిరా... ॥అన్నన్న ఓయన్న॥

బోరు బోరుకు నీ గుండె బగిలినగాని
నారుబోసినోడె నీరు బోస్తాడని
ఎవడు జెప్పి పాయెరా ఓరన్న
కడసూపు పాలైతిరా మాయన్న
దారిద్ర బతుకుల్లోన ఓరన్న
వడగండ్ల వానెట్టరా మాయన్నా
వడగండ్ల వానెట్టరా... ॥అన్నన్న ఓయన్న॥

101

అంబటి వెంకన్న పాటలు