పుట:Aliya Rama Rayalu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెల పోనిచ్చి యుభయసుల్తానులును కళ్యాణదుర్గమును ముట్టడించుటకై ప్రయాణభేరి మ్రోగించిరి. ఈవృత్తాంతము నంతయు జారులవలన విన్నవాడై విజాపురసుల్తా నగుఆలీఆదిల్‌షా భయకంపితచిత్తుడై వెంటనే విజయనగరమునకు బోయి రామరాయలను దోడ్పడరావలయు ననిప్రార్థించెను. రామరాయ లెంతమాత్రమును జాగుసేయక యసంఖ్యాకములగు సైన్యములతో బయలుదేఱి వచ్చెను. మార్గమధ్యమున నదివఱకే యాహ్వానింపబడిన బీడరుసుల్తా నగుఆలీబరీదుషాయును, బీరారుసుల్తా నగుబురహాన్ ఇమద్‌షాయును, తమ తమసైన్యములతో వచ్చి గలిసికొనిరి. వీరిస్థితి యిట్లుండగా నచట నహమ్మదునగర గోల్కొండసుల్తానులు నానావిధములయినవగు 700 ఫిరంగులతోడను, ఏనూ రేనుంగులతోడను బయలుదేఱి కళ్యాణిదుర్గమునకు 12 మైళ్ల దూరమున దండు విడిసిరి. వీరలాదుర్గమును సమీపించి శిబిరముల నేర్పాటుచేసి కొనకపూర్వమె దైవవశమున నొకగొప్పగాలివాన సంభవించి నల్లరేగడభూమితో గూడియున్న యాప్రదేశము నంతయు బెనురొంపిగ మార్చివేసెను. బండ్లు, పశువులు, ఫిరంగులు మొదలగునవి బురదలో గూరుకొనిపోయి కదల్పుటకు సాధ్యముగాక నిరుపుయోగము లయ్యెను. గుడారము లన్నియు నెగిరిపోయి బురదనేలను బొరలాడు చుండెను. ఇట్టిస్థితియందుండగానే రామరాయలసోదరుడు ప్రసిద్ధ సేనాధిపతి వేంకటాద్రియు, జగదేవరావును, పదునైదువేల యాశ్వికసైన్యము