పుట:Aliya Rama Rayalu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జెందియున్న మేటియోధులలో మొదట నెన్నదగినవాడు రామరాయల కడగొట్టుతమ్ముడు వేంకటాద్రి. ఇతడు వీర పురుషలక్షణములతో నొప్పెడు సుందరదేహము గలవాడు. 'ఆహవగాండీవి' యని ప్రతిపక్షయోధవరులుగూడ బ్రశంసించు నట్లుగా నాహవరంగమున నశదృశశౌర్యప్రతాముల జూపుచు విజృంభించి శత్రుసైన్యముల నురుమాడి భీభత్సముసేయు వారలు యుద్ధరంగమున నిలువ జాలక చెల్లాచెదరై పాఱిపోవ మొదలుపెట్టిరి. నరపతి విజయము నందలి యీతని తొలియుద్ధమున గొన్నజయ మీక్రింది విధమున వర్ణింపబడినది.

       "సీ. కందుకక్రీడగా గదనరంగస్థలి
                  గడువజీరులమస్తకముల దునిమి
           హరులను బొరిగొని కరులను దునిమి త
                  దారోహకుల ద్రుంచి వీరభటవి
           దళనంబుసేసి దుర్భరపతాకల గూల్ప
                  గనుగొని కాందిశీకత వహించి
           వీడుబట్టనునాస విడిచి నిజాము యే
                  దులఖాను కుతుపశాహులదళంబు

        తే. విచ్చ వెన్నిచ్చి కనుకని యిచ్చ బఱచి
           మెచ్చ జొచ్చిన నభయంబు నిచ్చి విజయ
           కాహళులు మ్రోయ నియమించి క్ష్మాజనంబు
           లభినుతు లొనర్పగా వేంకటాద్రిరాజు."