పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౦ - ఆశాభంగము

55

లతో పోరాట మేర్పడినది. బలవంతులైన మొగలాయీసేనాపతు లెవరును దక్కనులో లేరు. ఈలోపల పాదుషా కుమారుఁడు అక్బరనువాఁడు తిరుగఁబడి శంభుజీ అండఁజొచ్చెను. మహారాష్ట్రులను శిక్షించుటకు ఔరంగజేబు చేసినప్రయత్నములు ఏవియు కొనసాగవయ్యెను.

తనకొమారుఁడు అక్బరు శంభుజీకడ నున్నాఁడని తెలియఁగానే ఔరంగజేబు రాజపుత్త్రులతో సంధి కుదుర్చుకొని 1681లో దక్షిణమునకు వచ్చెను. అప్పటికి శంభువొకఁడే ఆతనికి శత్రువు. బిజాపురముమీఁదికిగాని గోలకొండమీఁదికిగాని దాడివెడలునుద్దేశ మాతని కింకను లేదు. శంభుజీమీఁదియుద్ధమున తనకు సాయపడవలసినదని బిజాపురి సర్దారులను పాదుషా కోరెనుగాని వారెవరును రాలేదు. శంభుజీతో ఆడిల్‌షా స్నేహముగానేయుండెను. శంభువునకు బిజాపురమువారి సాయము రాకుండుటకై పాదుషా తనసైన్యమును విభజించి ఇరువుర మీఁదికిని 1682లో పంపెనుగాని ఫలింపలేదు. 1683 లో పాదుషా అహమద్ నగరమునకు వచ్చెను. ఆసంవత్సరమే మహామంత్రి, సిద్దిమసూదు తమరాజ్యములోని అంతఃకలహములకు విసిగి తనయుద్యోగమును వదలుకొని ఆదవానిలో తనకోటలో ప్రవేశించెను.