పుట:Abraham Lincoln (Telugu).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొంత శాంతపఱచెను. తుట్టతుద కా పుస్తుకపు వెలగ నాబ్రహాము జోషియా పంట గోయవలసి వచ్చెను. అనేక యకరముల విరివిగలిగి మనుష్యు నెత్తుగ బెఱిగిన పైరు గోయుట కాబ్రహా మియ్యకొని సాధారణముగ నొక మనుష్యు డైదు దినములలో జేయగలుగునంత పనిని మూడురోజులలో సంపూర్తి సేసి పెట్టెను. "ఇంతకష్టపడిన బడితిని గాక. నా కొక క్రొత్త గ్రంథ మబ్బెనే" యని యత డెల్లపుడు హర్ష మొందుచుండెను.

________

ఆఱవ ప్రకరణము

క్రొత్త తల్లి, క్రొత్త విద్యాలయములు.

1819 వ సంవత్సరమువఱకు థామసు ద్వితీయ వివాహ ప్రయత్నములు సేయలేదు. ఈ మధ్యకాలమునంత సారాగృహకృత్యముల నెరవేర్చుచుండెను. ఆబ్రహాము దన సోదరికి సాయ మొనర్చ నియమింపబడి యుండెను. గొప్పవా డెచ్చటను గొప్పవాడె గదా. ఇంటి పనుల నెరవేర్చుటయందతడు ప్రవీణు డాయెను. తరువాత నిరుగుపొరుగువారి గేహముల నతడు పనిసేయుచున్నెడ మిక్కిలి మెప్పు వడయుట కిదియె కారణ మాయెను.