పుట:Abraham Lincoln (Telugu).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విల్లియము హానాల సంతసమునకు మేర లేకుండెను. లింకనునెడ వారికి గలిగిన కృతజ్ఞత వెలువరింప లేరైరి. అతడును వారి గౌరవాదరణవచనముల బ్రేమతో స్వీకరించి విల్లియమునకు బుద్ధిసెప్పి యతడు మరల నట్టి దుష్టసాంగత్యములకు బోకుండుటయె తనకు జూపదగు కృతజ్ఞత యని నొడివి వానిచేత నొప్పించుకొనియెను.

మఱియొకవిషయమున గూడ నీ "పిన్నిహానా" కితడు సాయ మొనర్చెను. అది పెంచి వ్రాయు టనవసరము.

మాఱుదల్లియెడ నితనికి గల యనురాగము గనబఱచు నట్టి యంశ మొండిట జూపనగును. న్యాయవాదిత్వమునకు బ్రారంభించిన కొన్నిదినములలో నొక్కవివాదమున లింక నైదువందల డాలర్లు గడించి వాని లెక్కించుకొనుచుండెను. అపుడు సహవాది యొకడు గనుపింప నాతనితో,

"ఇదె చూడుడు. నేసంపాదించినదానిలో నిదియె గొప్ప వేతనము. ఇక రెండువంద లేబదిడాలరు లున్న నొక మంచి క్షేత్రము గొని నాముసలి మాఱుదల్లి కియ్య గల్గుదు" ననెను.

'మిగత భాగ మే నప్పిచ్చెద' నని యతడు ప్రత్యుత్తర మిచ్చెను.

"అయిన సంతసించితిని కానిమ్ము" అనుచు లింక నప్పు పత్రము వ్రాయబోయెను.