పుట:Abaddhala veta revised.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరొక తీరులో చేతిమీద లేదా శరీరంపైన ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ ద్రావకం రాయాలి. సోడియం సాలిసిటేట్ లో కత్తిని ముంచి శరీరంపైనా,చేతిమీదా తాకిస్తే ఎర్రని మరకలు వస్తాయి. భక్తులు చందాలిచ్చి వెళ్ళిన తరువాత తడిగుడ్డతో తుడిచేయాలి. కాళీమాతను లేదా అమ్మవార్లను సంతృప్తిపరచే వంకతో కొరడాతో బాదుకొనడం మరో భక్తి నిదర్శన సంఘటనే. కొరడా చివరి వరకూ జాగ్రత్తగా మెలికలు తిప్పితే చప్పుడు వస్తుందే కాని దెబ్బ తగలదు. కొరడా చివర ముడివేస్తే అది తగిలిన చోట చర్మం చిట్లుతుంది. ఇది ప్రాక్టీసు చేసిన పూనకభక్తులు చూచేవారిని దడిపించేటట్లు మంత్రాలు ఉచ్ఛరిస్తూ, భయంకర శబ్దాలు చేస్తుంటారు.

తాంత్రికుల అగ్నిపరీక్ష

తాంత్రికవిద్య వింతగా, భయానకంగా వుంటుంది. తాంత్రిక యోగంలో స్త్రీవుండాలనేది నిషేధానికి గురైంది. తాంత్రిక విద్య బహుళ ప్రచారం పొందకపోయినా, అక్కడక్కడా ఆచరణలో వుంది,తాంత్రికులు అనేక విచిత్రచర్యలు చేస్తుంటారు. వారి భీభత్సభక్తికి నిదర్శనగా చాలా ప్రయోగాలు పేర్కొనవచ్చు.

ఒక లోహపాత్రలో రంపపుపొడి వుంచి అందులో సోడియం పెరాక్సైడ్ పొడి కలుపుతారు. భక్తులలో ఒకరిని పిలిచి నీళ్ళు తెమ్మంటారు. నీళ్ళు గుక్కెడు తాగి, రంపపు పొట్టుపై వదులుతారు. నీరు తగలగానే సోడియం పెరాక్సైడ్ వలన మంటలు లేస్తాయి. అప్పుడు తాంత్రికుడు ఏవో మంత్రాలు ఉచ్చరిస్తాడు. భక్తులు అదంతా మహిమగా స్వీకరిస్తారు.

పూనకం వచ్చినట్లు నటించే తాంత్రికుడు ఏవో సోది భవిష్యత్తు కబుర్లు చెబుతాడు. పొటాషియం నైట్రేట్ ద్రావకంలో నాలుగు పర్యాయాలు నారను ముంచి ఎండనిస్తారు. ఒకవైపు నారతాడు వెలిగించి మిగిలిన తాడు దూదితో వుండగా చుడతాడు. ఆ వుండను నోటిలో పెట్టుకుంటాడు. నోటితో గాలి వదులుతుంటే మంటలు వస్తుంటాయి. నోటిలో బాగా లాలాజలం వూరిన తర్వాత ఇలా చేస్తాడు. నోటిలో వుండ వున్నంతసేపు గాలి వదలడం తప్ప, పీల్చడు. తరువాత ఒక వస్త్రంతో నోటిలోని వుండ తీస్తాడు. అలా చేసినప్పుడు భక్తులు మంత్రాలు చదువుతుండగా శిష్యులు హావభావాలు చేస్తూ, కానుకలు వసూలుచేసి పెడతారు.

పక్షితీర్థంలో దైవం

తమిళనాడులో చాలాకాలంగా యాత్రికులు సందర్శనంచేసే స్థలం ఒకటి వుంది. తిరుపుర కుండ్రం అనే ఈ స్థలం దగ్గర యాత్రికులు ఆగుతారు. మధ్యాహ్నం సరిగా 12 గంటలకు రెండుగద్దలు వచ్చివాలతాయి. అక్కడ పురోహితుడు యిచ్చే ప్రసాదం స్వీకరించడానికి పక్షిరూపంలో సాక్షాత్తు గరుడపక్షులు వస్తాయని కథ ప్రచారంలో వుంది. విష్ణు వాహనంగా గరుడపక్షి వుండడం పురాణకథనం కాగా, ఆ దేవాలయం విష్ణు దేవాలయం కావడం ఒక కారణంగా పేర్కొంటారు. ఏమైనా రెండు పక్షులు వేళ తప్పకుండా నిత్యమూ రావడం వాస్తవం.