పుట:Abaddhala veta revised.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, బైబిలులో ఆదాం, ఈవ్, కెయిన్, ఏబల్, నింరోడ్, అబ్రహాం, ఐజాక్, జాకబ్ వంటివారు ప్రస్తావన వున్నా వారికి చారిత్రక నిజస్వరూపం లేదు. బైబిల్ వెలుపలవారికి స్థానం లేదు. అలాగే అద్భుతాలన్నీ బైబిల్ పై నమ్మకం గలవారికే పరిమితం.

బైబిల్ చెప్పే సృష్టివాదం శాస్త్రీయంగా యెక్కడా నిలవదు, బైబిల్ చెప్పిందంతా సత్యం అని మూర్ఖంగా పట్టుబడితే, శాస్త్రజ్ఞులకూ నమ్మకస్తులకూ ఘర్షణ రాకతప్పదు. అసిమోవ్ తన రచనలో ఈ హెచ్చరిక చేశాడు.

అమెరికాలో సుప్రసిద్ధ మానవవాది ఎడ్ డోయర్ రాస్తూ స్కూలు పిల్లల్ని ఫలానా విధంగా ప్రార్థన చేయమని, మౌనం వహించమని ప్రభుత్వ పాఠశాలల్లో శాసించే హక్కు లేదంటున్నారు. మతపండుగలు చేసుకోడానికి ప్రభుత్వాన్ని సెలవులు యివ్వమనడాన్ని ఆయన గర్హిస్తున్నారు. ప్రభుత్వం, మతం వేరుగా వుండాలని ఎడ్ డోయర్ తీవ్రంగా పోరాడుతున్నారు.

ఆఫ్రికా-అమెరికా మానవతావాదులు నామ్ ఏలెన్ సంపాదకత్వాన వెలువరించిన గ్రంథంలో జోరానీల్ ప్రశ్నలు ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. క్రీస్తు పావులను కాపాడటానికి పుట్టి, సిలువకు గురియై పాపాత్ములను రక్షించాడు కదా! ఇంకా మనుషులను పాపులంటూ చర్చీ ఫాదరీలు ప్రచారం చేస్తారేమిటి? పాపాలు పోగొట్టలేదా క్రీస్తు అని అడుగుతున్నారు. ఈ సృష్టి అంతా దేవుడు చేస్తే, అది మార్చమని ప్రార్థనలు చేయడం మరీ పాపం కదా అంటున్నారు. దైవ నిర్ధారణ మార్చమని ప్రార్థిస్తే, దైవసృష్టిలో దోషం వున్నట్లా? ఇక భక్తుల మాటకొస్తే, నాజీలు, జాత్యహంకారవాదులు సైతం పరమభక్తులే అని గుర్తు చేస్తున్నారు. పేదలకు సేవ చేయడానికి యింత డబ్బు ఖర్చుపెట్టి అంత పెద్ద గుడులు కట్టడం దేనికని కూడా ప్రశ్నిస్తున్నారు. కుటుంబ నియంత్రణ సాధనాలను పోప్ వ్యతిరేకిస్తుండగా సెక్యులర్ ప్రభుత్వాలు ఏంచేయాలో ఆలోచించుకోవాలి.

క్రైస్తవులందరూ జీసస్, బైబిల్ ను అంగీకరిస్తున్నా, వివరాలలో ఏకాభిప్రాయం లేదు. పైగా చంపుకునేటంత భేదాభిప్రాయాలున్నాయి. మూల ప్రతినిధిని నేనే అని పోప్ అనగా కాదని మార్టీన్ లూథర్ ఎదురుతిరిగాడు. ఎవరి బైబిల్ వారు అనువదించి, వాడుతున్నారు. ఎవరి వ్యాఖ్యానం వారు చేస్తున్నారు. దైవానికీ మనిషికీ మధ్య పోప్ ఎవరు అని ప్రశ్నించిన ప్రొటెస్టంటులు క్రమేణా ఫాదరీలను తెచ్చిపెట్టుకుని గుడులు కట్టి, కరడు గట్టుకపోయిన మతవ్యాపారంలోకి దిగారు. ఇప్పుడు కేథలిక్కులు, లూథరిన్లు, ప్రొటెస్టంట్లు, బాప్టిస్టులు, మెథడిస్టులు, ఎవాంజలిస్టులు, సెవెంత్ డే ఎవాంజలిస్టులు, పెంతకోస్తులు, ప్రెస్బీటేరియన్లు, ఆంగ్లికన్లు, కాంగ్రిగేషనలిస్టులు, డిసైపుల్స్ ఆఫ్ క్రీస్తులు, యూనీటేరియన్లు ఇంకా అనేక చిన్న శాఖలున్నాయి. అందరూ ఎవరి కుంపటి వారు వెలిగించి, నిధులు వసూలుచేస్తూ, మతమార్పిడులు జరుపుతూ, ప్రభుత్వ పన్నులు మినహాయింపులతో దైవం పేరిట మానవుడి పై స్వారీ చేస్తూ, మానవ బలహీనతలపై చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు.