పుట:Abaddhala veta revised.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రివల్యూషనరీ ఏజ్.బి.ది.పుల్ఫ్ దీనికి సహసంపాదకుడు. భారత కమ్యూనిస్టు పార్టీ రాయ్ అరెస్టు పట్ల మౌనం వహించడం సిగ్గుచేటు అని ఆగస్టు 29(1931)న యీ పత్రిక ప్రధాన శీర్షికలో విమర్శించింది. జర్మనీ, స్వీడన్ దేశాలలో అనేక సంస్థలు రాయ్ ను విడుదల చేయమని తీర్మానాలు చేశాయి. భారత కమ్యూనిస్టులు "నూరు శాతం కమ్యూనిస్టులు" రాయ్ ను రెనగేడ్ గా చిత్రించి, అతడిని ఎదుర్కోవాలని, లజ్జాకరమైన విమర్శలు చేసినట్లు యీ పత్రిక వ్యాఖ్యానించింది. జర్మనీ ఫాసిస్టులకు సైతం తోడ్పడిన అంతర్జాతీయ రెడ్ ఎయిడ్ సంస్థ, రాయ్ పట్ల విద్రోహకరంగా ప్రవర్తించి, అతడిని జైలులో కుమిలి పోనిమ్మని ప్రకటించింది.

జర్మనీ కమ్యూనిస్టు పార్టీ రాయ్ విడుదల కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హాంబర్గ్ లో బ్రిటిష్ కాన్సల్ కు యీ మేరకు ఒక లేఖ అందజేశారు. రైష్ స్టాగ్ కమ్యూనిస్టు ప్రతినిధి జడాష్ తీర్మానం ప్రవేశపెట్టగా హర్షధ్వానాల మధ్య ఆమోదించారు.

రాయ్ విడుదల కోరుతూ జర్మనీ, స్వీడన్ లోనే గాక, అల్సాస్, చకోస్లోవేకియా కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా తీర్మానాలు వచ్చాయి. సోషలిస్ట్ డెమొక్రటిక్ పత్రికలు రాయ్ అరెస్టు పట్ల మౌనం వహించడాన్ని యీ పత్రిక దుయ్యబట్టింది. రాయ్ ను బ్రిటిష్ సామ్రాజ్యవాద కబంధహస్తాల నుండి విడుదల చేయించడానికి కార్మికసంఘాలు,వలసదేశాలలో అణిచివేతకు గురైనవారు ముందుకు రావాలని యీ పత్రిక కోరింది. వర్గ ఆసక్తి రీత్యా పెట్టుబడిదారీ పత్రికలు మౌనం వహించడంలో ఆశ్చర్యం లేదని వ్రాసింది.(సెప్టెంబరు 12,1931).

ఎం.ఎన్.రాయ్ విడుదలకై ఐన్ స్టీన్ ప్రకటన

ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ జర్మన్ లో క్లుప్తమైన ప్రకటన చేస్తూ, మానవేంద్రనాథ్ రాయ్ ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదలచేయాలని కోరారు. ఈ విషయాన్ని రివల్యూషనరీ ఏజ్ పత్రిక సెప్టెంబరు 26,1931న ప్రకటించింది.

ఐన్ స్టీన్ ప్రకటన మూలప్రతి నేడు జెరూసలేంలోని హిబ్రూ యూనివర్శిటి ఐన్ స్టీన్ పత్రాలలో వుంది. దీని మైక్రోఫిలిం ప్రతి అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటి ఐన్ స్టీన్ పత్రాలలో వుంచారు.

ఐన్ స్టీన్ వలె యింకా అనేక మంది రాయ్ విడుదల కోరుతూ ప్రకటనలు చేశారు. ఫ్రెంచి కమ్యూనిస్టు నాయకుడు హెన్రి బార్బూన్ అలాంటి వత్తిడి చేశాడు. జర్మనీలో అనేక సంస్థలు రాయ్ ను విడుదల చేయమని తీర్మానించాయి. కెమికల్ వర్కర్స్ యూనియన్, పబ్లిక్ హైస్కూలు టింజ్, గెలిల్స్ బర్గ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, షోనింగన్ కేంద్ర కార్మిక సంఘం, జెనానేజర్ ఫ్రెండ్స్, ఫాసిస్టు వ్యతిరేక లీగ్ యిందులో పేర్కొనదగినవని రివల్యూషనరీ ఏజ్ ప్రకటించింది. (1931 సెప్టెంబరు 26 న్యూయార్క్) బ్రిటిష్ జైలు నుండి రాయ్ ప్రపంచ కార్మికులకు,రైతులకు,మేధావులకు ఒక విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడమని కోరాడు. తాను