పుట:Abaddhala veta revised.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతరత్రా కుంగిపోయారు. పవిత్ర గ్రంథాల ప్రమాణంగా ఆచరిస్తున్న యీ భావాలను పోగొట్టుకోవాలి! హిందువులలో పునర్వికాసానికి రామమోహన్ రాయ్, డిరోజియోలు 19వ శతాబ్దంలో నాంది పలికారు. రానురాను అవి వెనుకంజవేసి, మతమౌఢ్యం పెరిగింది. అందుకే ప్రపంచంలో ఇతరులతో బాటు ముందుకు పోలేకపోతున్నారు. ఇందుకు కృషి జరగాలి. వెనుకటి స్వర్ణయుగం అనుకుంటూ,రామరాజ్యం అనే భ్రమపూరిత నినాదాలతో ప్రజల్ని కొంతకాలం మభ్యపెట్టారు. శాస్త్రీయ పంధాలో, మానవవిలువలతో ముందుకు సాగాలంటే,గతం నుండి వస్తున్న దోషాల్ని, భారాన్ని తొలగించుకోవాలి. రాజ్యాంగానికి అడ్డొస్తున్న వాటిని దూరంగా పెట్టాలి. ముఖ్యంగా మతాన్ని వ్యక్తిపరంగా వుంచి, వీధుల్లో ప్రదర్శించనివ్వకుండా సాగాలి. ప్రజల్ని వెనుకబడినతనంలో అట్టిపెట్టి వారి ఓట్లతో ముందుకుపోదామనే పార్టీలు, సంస్థలు వ్యక్తులు పునర్వికాసానికి పెద్ద అవరోధం అని గ్రహించాలి. ఈ అడ్డంకి తొలగించుకోవడంలోనే విజ్ఞత వున్నది.

- హేతువాది, మే 1990
అరవిందాశ్రమంలో ఆధ్యాత్మిక వ్యాపారం!?

అరవిందుడు తత్వవేత్తగా గొప్పవాడా, మర్మయోగిగా నిలబడతాడా, రాజకీయాల్లో ఆధ్యాత్మిక అతివాదిగా పేరు తెచ్చుకున్నాడా అనేది ప్రస్తుత సమస్య కాదు. భారతదేశం నుండి పారిపోయి, ఫ్రెంచివారి ఆధీనంలో వున్న పాండిచేరిలో దాక్కున్న అరవిందుడు అక్కడ ఏం చేశాడనేదీ ప్రస్తుతాంశం కాదు. అరవిందుడు భార్యతో కాపురం చేయలేదెందుకని అడిగే హక్కు మనకులేదు. ఫ్రాన్సులో వివాహిత అయి, పిల్లలున్న మరొక ఫ్రెంచి స్త్రీతో కలసి పాండిచేరిలో వున్నాడనటంలో మంచిచెడ్డలు వెతకటం యిప్పుడు సందర్భం అనిపించుకోదు. అదిగాక, ఆధ్యాత్మిక లోకపు విలువలు వేరు గదా! వాటిని మన సామాన్యుల విలువలతో కొలిస్తే మనమే చులకన అవుతాం.

ఫ్రెంచి స్త్రీతో కలసి...

కాగా, అరవిందుడు ఉత్తరోత్తరా 'మాత' గా పిలువబడిన ఫ్రెంచి స్త్రీతో కలసి పాండిచేరిలో ఆశ్రమం పెట్టారు. దేశంలో యెక్కడ ఆశ్రమం పెట్టినా జనం చేరతారు. మరి ఇంగ్లండులో చదువుకొని, అతివాద రాజకీయాలలో కొన్నాళ్ళున్న అరవిందుడు ఆశ్రమం పెట్టాడంటే, దానికి బహుళ ప్రచారం రావటంలో ఆశ్చర్యం లేదు. ఆశ్రమం అంటే సంప్రదాయబద్ధమైన ఆశ్రమం కాదు. పాండిచేరి సముద్రపు ఒడ్డున అధునాతన భవనాల సముదాయమే ఈ ఆశ్రమం. అరవిందుడు చనిపోయాడని ప్రచారంచేసి కొంతకాలం భక్తుల్ని నమ్మించారు. ఆ తరువాత మాతగా ఆశ్రమంపై ఆధ్వర్యం వహించిన ఫ్రెంచి స్త్రీ చనిపోయిందని ప్రచారం చేశారు, భక్తులు అప్పుడూ నమ్మారు, ఇప్పుడూ నమ్మారు.