పుట:Abaddhala veta revised.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూరిగెల్లర్ తనను దివ్యశక్తుల మాంత్రికుడుగా ప్రచారం చేసుకుని డబ్బు ఆర్జించగా జేమ్స్ రాండి అతడ్ని డీకొన్నాడు. చెంచాలు చూపుతో వంచడం,ఇంకా అనేక శక్తుల వెనుక ఎలా దగా చేస్తున్నాడో చెప్పాడు. చివరకు కోర్టు తగాదాలలో యూరిగెల్లర్ ఓడిపోయి అమెరికా నుండి పారిపోయి ఇంగ్లండ్ లో స్థిరపడ్డాడు. క్రైస్తవ మత ప్రచారకులు ఎప్పటికప్పుడు జేమ్స్ రాండి దెబ్బలకు హతమౌతూనే వున్నారు.

జేమ్స్ రాండి రాసిన Faith Healers పుస్తకానికి శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్ పీఠిక రాశాడు.

మెకార్ధర్ అవార్డు అందుకున్న జేమ్స్ రాండి కెనడా వాసి అయినా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాడు. అవివాహితుడు. ఆయన పరిశోధనలు ఇప్పుడు కంప్యూటర్ ద్వారా website లో చూడవచ్చు.

ప్రపంచ ప్రళయం వస్తుందని పవిత్ర గ్రంథాలలో అన్ని మతాలు పేర్కొని జనాన్ని ఎప్పటికప్పుడు హడలుగొడుతూనే వున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖమైన 49 ప్రళయ జోస్యాల్ని జేమ్స్ రాండి ప్రచురించాడు. అన్ని తేదీలతో సహా వున్నాయి. ఎప్పటికప్పుడు మతాలు కొత్త తేదీలు యిస్తూ జనాన్ని భయం గుప్పిట్లో, తమ సేవలో అట్టిపెడుతున్నాయి. 2000 సంవత్సరం కూడా అంతానికి తేదీగా నిర్ణయించి, ఏమీ జరగకపోయేసరికి, కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

ఆసక్తికరమైన ఎన్‌సైక్లోపేడియాలో జేమ్స్ రాండి చూపిన వివరాలు, ఒక్కొక్క అంశంపై యిచ్చిన సరళమైన, చతురోక్తులతో కూడిన వివరణ గమనార్హం.

(An Encyclopedia of claims,frauds and hoaxes of the occult and super-natural,by James Randi, St. Martins press,175 Fifth avenue, New York 10010 USA,284 పేజీలు Arthur C.Clarke పీఠిక)

ఇందులో హోమియో గురించి జేమ్స్ రాండి ఏమన్నాడో చూడండి. హానిమన్ రోగాలన్నీ మూడంశాలనుండే వస్తాయన్నాడు. సిఫిలస్, దురద పేర్కొనదగినవి. ఏ లక్షణాలున్న రోగం అదే లక్షణాలతో నయమౌతుంది. హోమియోలో వాడే ఔషధంలో మందు వుండదు. ప్రకంపనాలతో శక్తి పెరిగి, మందులో దాగివుంటుంది. వాస్తవానికి కేవలం నీరు మాత్రమే వుంటుంది. నీటిని అయస్కాంతీకరణ చేయవచ్చునని ప్రస్తుతం కొందరు రాగతీగెల్ని వాడుతున్నారు. మూలకారణాల జోలికి పోక, రోగలక్షణాలనే హోమియో పట్టించుకోడానికి వారికి మూలం తెలియకపోవడమే.

హోమియో ఒక రకంగా మాజిక్ అంశంగా మారింది. అందుకే యీ పుస్తకంలో దానిని చేర్చినట్లు జేమ్స్ రాండి పేర్కొన్నాడు.

ఎన్ సైక్లోపేడియాలో అబారిస్ (పైథాగొరస్‌కు గురువు)తో ఆరంభించి జోంబి (Zombie) తో ముగించాడు. ప్రతి మాటను సంక్షిప్తంగా అర్థమయ్యేట్లు చెప్పడం జేమ్స్ రాండి కళ.