పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహారణ్యములగుండ 900 లీలు (180 మైళ్ళు) ప్రయాణముచేసి, ఆంధ్రదేశమును సమీపించెను. ఆంధ్రదేశమును గూర్చి మన యాత్రికు డిట్లువ్రాసియున్నాడు.

"ఈదేశము మూడువేల లీలు (610 మైళ్ళు) వైశాల్యము గలిగి యున్నది. రాజధానియు నిరువది లీలు వైశాల్యముగలది. ఈనగరమును జనులు (పిన్-గీ-కి-లో) వేంగీపురమని బిలచెదరు. ఈప్రాంతము మిక్కిలి సారవంతమై యెల్లప్పుడు సేవ్యము చేయబడుచు సర్వసస్య సమృద్ధమై యున్నది. ఈదేశముష్ణ ప్రదేశము. జనులు సాహసము గలవారు. కాని తొందరపాటు గలవారుగా నున్నారు. వీరి భాషయు వాక్యముల కూర్సుయు, మధ్యదేశము వారి భాషకంటె భిన్నముగా నుండును. కాని వీరుపయోగించు అక్షరముల స్వరూపము మధ్యదేశములవారి యక్షర స్వరూపమును ఇంచుమించుగా బోలియుండును. ఇక్కడ నరువది సంఘారామములును అందు మూడువేల భిక్షువులు నున్నారు. ముప్పది దేవాలయములు గూడ గలవు. ప్రజలలో బ్రాహ్మణులును, జైనులును గూడ గలరు."

"వేంగిపురమున కనతి దూరమున నొక సంఘారామముగలదు. అందు అంతస్తులుగల హర్మ్యములును, మనోహరములయి విచిత్రములయిన అలంకారములచే శోభిల్లెడి గోపురములును స్థంభములును గల యితర గృహములును చాల గలవు. ఇచ్చటనొక బుద్ధుని విగ్రహము కలదు.