పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౦

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

యుఁఆన్‌ చ్వాంగ్‌ భరతవర్షమును, క్రీ. శ. ౬౨౯ సంవత్సరమున వర్షఋతువు గడచిన వెనుక ప్రవేశించి, యుత్తర హిందూస్థానము నంతట నేడెనిమిది సంవత్సరములు సంచారము చేసి, క్రీ. శ. ౬౩౭ వ సంవత్సరమును నాలందా సంఘారామమును జేరుకొని యించుమించుగా రెండు సంవత్సరముల కాలమచ్చట గడపి, మహాతత్వవేత్త యగు శీల భద్రునికడ అనేక శాస్త్రములను అభ్యసించెను. పిమ్మట బౌద్ధధర్మ గ్రంథములను, శాస్త్రములను అనేకములను సమకూర్చుకుని తామ్రలిప్తీ నగరమున నోడనెక్కి, సింహళ ద్వీపముమిాదుగా, చీనా దేశ మునకు మరలిపోవ నిశ్చయించుకొనెను. ఈతఁడు తామ్రలిప్తీ నగరమును జేరునప్పటికి, నాశ్వీయుజమాస మగుటవలన, ఆమాసమున సముద్రయానము వర్జింపవలయునని వారింపబడి, దక్షిణాభిముఖుడై, ఆంధ్ర, మహాంధ్ర దేశములందలి పుణ్యక్షేత్రముల గూర్చియు అమరావతీ ధాన్యకటక స్థూపములను గూర్చియు కంచి నగరమును గూర్చియు వినియుండినందున వానిని కూడ సందర్శించి పోవవలెనని సంకల్పించి, నాటుదారిని ప్రయాణము సాగించెను.

ఏమి కారణముననో యుఁఆన్‌ చ్వాంగ్‌ దక్షిణదేశములగూర్చి ఉత్తరదేసములవలె, విపులముగను, సవిస్తరముగను వర్ణింపక, సంగ్రహముగా జెప్పుచు బోయినాడు. మరియు, ప్రమాదములయినవి పెక్కు విషయములను జొప్పించి