పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశేషసైన్యమిచ్చి తన సోదరుదు మహమ్మదుఖానుని రాయలమీదికి, బంపెను. దేవరాయలాసమయమున, తురకలతో సంధిచేసుకొని మహమ్మదుఖానుని సాగనంపెను. ఈ విజయమున కుప్పొంగి మహమ్మదుఖాను, సోదరునిపై దిరుగబడెను. ఈ తిరుగుబాటు నందు, దేవరాయలు, మహమ్మదునకు దోడ్పడియెను. మహమ్మదు, ముద్దకల్లు, షోలాపురము, రాయచూరు, బీజపురము మొదలగు పట్టణములను స్వాధీనము చేసుకొనెను గాని సుల్తాను సైన్యములతో దలపడినపు డపజయమునొంది పాఱిపోయెను. తరువాత సుల్తాను, అనుజుని, తప్పిదమును మన్నించి, రాయచూరుకోట నాతని కిచ్చెను.

విజయనగరమునకును, కలబరిగె సుల్తానులకును జరుగుచుండిన యుద్ధములందు, జయలక్ష్మి చంచలయై యుండుటజూచి, ఇమ్మడి దేవరాయలు, భామినీసుల్తానులకును, తనకు గల విరోధనమును గుఱించి తలపోసి, మంత్రి, పురోహిత, సేనాపతి, సామంత, దండనాధులను, హితులను, బ్రాహ్మణులను బంధువులను ఎల్లరును రావించి, యొక సభగావించి, తనరాజ్యము, భామినీ రాజ్యముకంటె నధికవిస్తీర్ణత కలదనియు, నైశ్వర్యప్రద మైనదనియు, బహు సేనావృతమైనదనియు, అట్లయినను, దురష్కులే యుద్ధములందు జయముగాంచుచుండుటకు గతంబేమియనియు ప్రశ్నించెను. అందులకు పలువురు పలువిధములుగ తమకు తోచినతెఱంగుల విన్నవించిరి. రాయలువారు బల్కినదంతయు విని, తురకల యుద్ధపద్ధతిని