పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్ చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

సంపాదించెను. చిన్ననాటనుండియు నితడు, సూక్ష్మగ్రాహియనియు, ఈడుకు మించిన మేధావంతుడనియు బొగడ్త నొందెను. ఇతర బాలురవలె నాటపాటలయందును, వేడుకలందును మన కథానాయకు డభిరుచి గలిగియుండక, నెల్ల వేళల జ్ఞానదాయకములయిన విషయములను గ్రహించుటకు తన కాలము నంతయు వినియోగించి కృషి సలుపుచుండెడివాడు. చిన్ననాటను కన్‌ప్యూషియను మతసంప్రదాయము నవలంబించి "మాతృ పితృభక్తి" ని గురించి, యామహాత్ముడు రచించిన మహాగ్రంథమును సూక్ష్మబుద్ధితో బఠించెను. తల్లితండ్రులీతని కిడిన పేరు "చే౯ ఐ" అయి యుండినను ఏమి కారణముననో చీనా సారస్వతమునందా పేరుతో ఈతఁడు బిలువ బడుచుండుటలేదు. ఈతఁడు పితృ, పితామహులవలె మిక్కిలి పొడవైనవాడు. మంచికాంతి గల దేహచ్ఛాయ గలవాడు. సుందరమైన రూపము గలవాడు. సోగలయి విశాలములయిన నేత్రములవాడు. చరిత్రకారులు యుఁఆన్ చ్వాంగ్‌యొక్క వంశము, పురాణ ప్రసిద్ధమైన హూఅంగ్‌-టీ గోత్రోద్భవమనియు, మహాచక్రవర్తి షూ-న్‌ యొక్క అన్వయమునుండి జనించినదనియు బల్కుదురు. మరియు నీతని పూర్వులు, వంశకర్తలు, క్రీస్తునకు బూర్వము ఆరవశతాబ్దమునాటికే ప్రఖ్యాతి వడసినట్లు చెప్పుదురు. క్రీ. శ. ౬౦౦ సంవత్సరమున చీనాదేశమున ఉత్తర ప్రాంతమున హోనను జిల్లాలోని కౌషి నగరమున