పుట:Aananda-Mathamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఆనందమఠము


ప్రగాఢము చేతను, కడుపునం దన్న రసము లేని సంకటము చేతను, కల్యాణిక్రమక్రమముగా బాహ్యజ్ఞానశూన్యురాలై అంతఃకరణశుద్ధివలన చైతన్య ముయురాలై అంతరిక్షమునం దేదో యొక దివ్యస్వరముచే పాడుచునున్న యొక గీతమును విన్నది. ఆగీత మెట్లన,——

హరే మురారే మధుకైటభారే
గోపాల గోవిన్ద ముకున్ద శౌరే
హరే మురారే మధు కైటభారే.

కల్యాణి బాల్యమునుండి పురాణములయందు, దేవర్షి యగు నారదమునీంద్రుఁడు గగనమార్గమునందు వీణాపాణియై హరినామసంకీర్తనము చేయుచు ప్రపంచమంతయు సంచరించు నని విని యుండెను. ఆ భావమే యామె మనస్సునందు జాగరిత మగుచుండెను. ఆనారీరత్నము తనమనస్సులోనే, శుభ్ర శరీర శుభ్ర కేశ శుభ్రశ్య శ్రు శుభ్రవసన మహాశరీరములుగల నారద మునీంద్రుఁడే వీణాధరుఁడై, చంద్రాలోకమువలన ప్రదీప్తమైన నీలాకాశ మార్గమునందు 'హరే మురారే మధు కైటభారే ' అని పాఁడుచున్నాఁ డని భావించి కొనియెను.

క్రమక్రమముగా ఆగీతము అతిసమీపమున వినవచ్చుచున్నట్లుగా బోధమయ్యెను. మఱల దగ్గరగా 'హరే మురారే మధు కైటభారే' అను నట్లుండెను. తుదకు కల్యాణి తలమీఁదుగా నావనస్థలియే ప్రతిధ్వనితమై సంగీతమైనది.

హరే మురారే మధు కైటభారే.

అంత కల్యాణీ కన్నులు మూసికొనియెను. ఆయర్ధస్ఫుటమైన వనాంధకారముచేత మిశ్రమైన చంద్ర కిరణమునందు,