పుట:Aananda-Mathamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

ఆనందమఠము


మహాపురుషుడు—— ఆంగ్లేయు లిపుడు వర్తకులు. అర్థ సంగ్రహమందే బుద్ధిగలవారై యున్నారు. రాజ్య శాసన భారమును వహించుట కష్టము లేదు. ఈసంతాన విద్రోహమే కారణమై రాజ్య శాసన భారమును వహింపవలసివచ్చును. ఏమనఁగా, రాజ్య శాసనము చేయక గాని అర్థసంగ్రహము కాదు. ఆంగ్లేయులు రాజ్యాభిషిక్తు లగుటకే సంతానవిద్రోహము సంఘటించెను. ఇప్పుడు వెళ్లుము. జ్ఞానసంపన్నుఁడ వైనపిదప నీకు నీవే సర్వమును దెలిసికొనఁగలవు.

సత్యానంద——మహాత్మా! నాకు జ్ఞానలాభంబునం దభిరుచి లేదు. జ్ఞానముతో నాకుఁ బని లేదు. నే నేవ్రతమునందు వ్రతియై యుంటినో యావ్రతమును రక్షించుకొని యుండెద. నావ్రతమైన మాతృభక్తి యచలముగా నుండున ట్లాశీర్వ దింపుఁడు.

మహా పురుష——వ్రతము సఫల మాయెను. తల్లి యొక్క మంగళమును సాధించితివి. ఆంగ్లేయ రాజ్యమును స్థాపితము చేసితివి. యుద్ధవిగ్రహములను విడువుము, జనులు కృషి కార్యమున నియుక్తులగుదురుగాక, పృథ్వి సస్య శాలిని యగుఁగాక,

సత్యానందుని నేత్రములనుండి అగ్ని కణములు రాలెను. అతఁడు, “శత్రువుల రక్తమును పాఱించి మాతను సస్య శాలిని గాఁ జేసెద" ననెను.

మహాపురుష—— శత్రువు లెవరు? శత్రువు లింక లేరు. ఆంగ్లేయులు మిత్ర రాజులు, ఆంగ్లేయులతో యుద్ధము చేసి జయించుటకు శక్తి గలవారును ఎవ్వరును 'లేరు.