పుట:Aananda-Mathamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదినాలుగవ ప్రకరణము

231


శాంతి, “ఇఁక అచ్చటికి పోనేల? మహామాతయొక్క కార్యోద్ధార మాయెను. ఈ దేశము సంతానుల వశ మాయెను. మనకు రాజ్యంబున భాగము వద్దు” అనెను.

జీవానంద——దేనిని జయించినామో దానిని 'బాహుబలముచేఁ గాపాడుకొనవలదా?

శాంతి——కాపాడి యుంచుకొనుటకు మహేంద్రుఁ డున్నాఁడు. సత్యానందుఁడు నున్నాఁడు. నీవు ప్రాయశ్చిత్తమును జేసికోని సంతానధర్మంబునకై దేహమును ద్యజించి యుంటివి. ఇప్పుడు మరల ప్రాప్తమైన దేహమునందు సంతానుల కేమియు నధికారము లేదు, మనము సంతానుల పాలిటికి చచ్చినవారమై యున్నారము. ఇప్పుడు సంతానులు మనలఁ జూచినచో; “జీవానందుఁ డా యుద్ధసమయమునఁ బ్రాయశ్చిత్త భీతి చే దాఁగికొని యుండి జయమైనందున రాజ్య భాగమునకై వచ్చి యున్నాఁడు.” అని చెప్పుదురు.

జీవానంద——అదెట్లు, శాంతీ! జనాపవాదంబునకు వెఱచి మనము చేయుపనులను మానవలయునా? మనపని మాతృసేవ. ఎవరేమి చెప్పినను నేను మాతృ సేవను వదలను.

శాంతి——దానికి నీకు మరల నధి కారము లేదు. ఏమనఁగా, నీవు మాతృసేవానిమిత్తమై దేహమును ద్యజించితివి. మరల మాతృసేవ చేయవలసినయెడల నీ ప్రాయశ్చిత్తము నిష్ప్రయోజన మగును. మాతృసేవకంటె ప్రాయశ్చిత్తము శ్రేష్ఠమైనది. లేకుండినచో, కేవల మీతుచ్ఛమైన ప్రాణమును పరిత్యజించు టొక పెద్దపనియా?