పుట:Aananda-Mathamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

13


మేఁత వేసి నీళ్లు పెట్టుచు నుండెను. ఒకనాడు మహేంద్ర సింహుడు భార్యను జూచి —— ఇట్లేన్నాళ్లు నీవు చేయఁగలవు ? అనెను.

కల్యాణి ——చాలాదినములు జరుగదు. జరిగినన్నాళ్లు జరుగనిండు. పిమ్మట తాము బిడ్డను పిలిచికొని నగరమునకు పోయి చేరవలసినదే.

మహేంద్ర —— నగరమునకుఁ బోయి చేరవలసినపుడు నిన్నేల నే నింత శ్రమ పెట్టవలయును. ఇపుడే యెందులకుఁ బోఁగూడదు, బయలు దేఱుము; పోవుదము.

తర్వాత ఈ విషయమై భార్యాభర్త లిర్వురకును విశేష చర్చ జరిగెను.

కల్యాణి —— నగరమునకుఁ బోయిన మేలే.

మహేంద్ర —— పేరేమో రాజనగరము, అది వీరభూమికి రాజధానిగా నున్నది. అచ్చటను ఇదే యవస్థ, జనులు లేరు. ప్రాణరక్షకు ఉపాయము లేనే లేదు.

కల్యాణి —— అట్లయినచో మూర్షిదాబాదు, కాశీంబజారు, కలకత్తా, ఈ ప్రాంతములలో నెచ్చటికైనను బోయిన ప్రాణరక్షణ కలుగును. కనుక, మనము పోయియే చేరవలయును. ఇచ్చట బ్రదుకలేము.

మహేంద్ర —— ఈయిల్లు మాతాత ముత్తాతల కాలము నుండి యున్నది. పరంపరగా సంపాదించిన సకల సంపదలు నిచ్చటనే యున్నవి. మనము విడిచి పెట్టిపోయినయెడల సర్వమును దొంగలు దోఁచికొని పోవుదురు.