పుట:Aananda-Mathamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ఆనందమఠము


బడి యుండెను. గౌరిభవానందునిరాక నెఱిఁగించి వచ్చిన పిదప, భవానందుఁడు ప్రవేశించెను.

భవానంద—— ఎట్లున్నది? కల్యాణీ! శరీర మారోగ్యముగ నున్నది కదా?

కల్యాణి—— ఈ ప్రశ్న నడుగుటను మీరు మానరు కదా? నాశరీరారోగ్యమునందు మీ కిష్టమా? లేక నాకిష్టమా?

భవానంద——ఎవఁడు వృక్షమును వేయునో వాఁడు దానికి నీరు పోయును; చెట్టు వృద్ధియైనచో వానికి సుఖము; నీ మృత దేహంబున నేను ప్రాణమును నాటినవాఁడను, వ్రుద్ది యగు చున్నదో లేదో యని నే నడుగఁ గూడదా?

కల్యాణి——విషవృక్షంబునకు క్షయము కలదా?

భవానంద——జీవనము విషమా?

కల్యాణీ—— అట్లు కాకున్న యెడల అమ్రతనేచనముగ నుండుదానిని ధ్వంసము చేయవలయు ననెడి కోరిక నా కేల కల్గును?

భవానంద——దానిని గుఱించి యడుగవలయునని చాల దినములనుండి నామనస్సునం దుండెను. అడుగుటకు దైర్యము లేకుండెను, నీజీవనమును విషమయముగాఁ జేసినవా రెవరు?

కల్యాణి——స్థిరభావముతో నాజీవనము నెవ్వరును విషమయముగాఁ జేయ లేదు. జీవనమే విషమయము; నాజీవనము విషమయము; తమ జీవనమును విషమయము; అందఱ జీవనమును విషమయమే.

భవానంద——ఔను; కల్యాణీ! నాజీవనము విషమయము. ఏదినము మొదలుకొని——నీ వ్యాకరణము ముగిసెనా?