పుట:Aananda-Mathamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

ఆనందమఠము


జీవానందుఁడు కందిన మోముకలవాఁడై, చూడుము, 'శాంతీ! ఒకనాఁడేమో నాకు వ్రతభంగము కలిగి నాప్రాణము ఉత్సర్గమై పోయి యుండెను. ఆపాపంబునకుఁ బ్రాయశ్చిత్తము కావలయును. ఇన్ని దినములకుఁ బ్రాయశ్చిత్తము జేసికొను చున్నాను, కేవలము నీకోరిక చేతఁ జేసికొన లేదు. ఇఁక ఘోర యుద్ధము జరుగుటకు కాలవిళంబము 'లేదు. ఆయుధ్ధ క్షేత్ర ముననే నాప్రాయశ్చిత్తము జేసికొనవలయును. ఈ ప్రాణమును ద్యజింపవలయును. నేను చచ్చుపర్యంతము ఈ బ్రహ్మ చర్యమే' అనెను.

శాంతి—— నేను నీ ధర్మపత్నిని; సహధర్మిణిని; ధర్మ కార్యమునందు సహకారిణినై యున్నాను. నీ వతిశయమైన గురుతర ధర్మంబును గ్రహించిన వాఁడవు. ఆధర్మమునకు సహాయము చేయుటకే నేను ధర్మంబును గృహమును త్యజించి వచ్చి నదానను. ఇరువురును జేరి ధర్మాచరణము నాచరింత మనియే కదా యిల్లు విడిచివచ్చి వనమున వసించుచున్నాను. నీ ధర్మమును వృద్ధి చేసెదను, ధర్మపత్నినై యుండి ధర్మమును విఘ్నము చేయుదునా? వివాహము ఇహమునకు పరమునకు ప్రయోజనకారి. ఇహమునకు మాత్రమే నేను నిన్ను వివాహ మాడ లేదు. దానిని నీ వెఱుంగుదువు, మన వివాహము పరలోక ప్రయోజనమునకునై యున్నది. పరమున ఫల మొకటికి రెండింత లగును. ప్రభూ! నీవు నాకు గురుఁడవు. నేను నీకు ధర్మ మును జెప్పఁగలనా ! మఱియు నీవు వీరుఁడవు, నీకు వీర వ్రతమును నేర్పఁగలనా?