పుట:2030020025431 - chitra leikhanamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కెరటములు పుట్టుచుండును. చేపలు కప్పలు కొంతవరకు నీటినిలుకడను చెరిపివేయును. దీనివిషయమై చెప్పుట కంతగా వీలు లేదు. 35 - 1 చిత్తరువును చూచిన గొంతవఱకు బోధపడును.

వాయువు నెమ్మదిగ నున్నపుడే నీరు నిలుకడగ నుండును. కాన నిట్టినీటిప్రదేశమును చిత్రించునపుడు గాలి వేయుచున్నటుల వ్రాయుట గొప్పతప్పిదము. ఇట్టినీటిపై ననేకపులుగు లెగురుచుండును. మధ్యమధ్య గడ్డి మొలచియుండును. కొంగలు నిలబడి యుండి యాహారమునకై బకధ్యానము చేయుచుండును. ఇట్టివస్తువులపేరులను వేనవేలు వ్రాయవచ్చును. కాని తుదకు లాభము లేకపోవును. ఇదివరకు చెప్పినప్రకసరము విద్యార్థి తన డ్రాయింగు పరికరములతో నిట్టిస్థలమునకు పోయి వ్రాయుచుండుటయే యుత్తమము. అభ్యాసమువలనను, అనుభవమువలనను అనేకవిషయములను నేర్చుకొనవలెను.

సముద్రపుకెరటములు :- ఈకెరటములు సదా భూమిపైకి దొర్చుచుండును. సాధారణముగ నివి సౌందర్యముగ నుండును. కాని వీటిముఖమున గాలి వీచుచున్నయెడల అనేకవిధము లగునాకృతులను దాల్చుచుండును. సముద్రతీరపుస్థితినిబట్టి యివి చాలవరకు మారుచుండును. 35 - 2 చూడుము.

సముద్రము పోటెక్కినపుడు కెరటముల కేమైన నడ్డు వచ్చినయెడల నవి మిక్కిలి యెత్తుగ లేచును. సాధారణముగ కెరటములు పండ్రెండడుగులకంటె యెత్తుగ లేవవు. కొన్నిసమయములయందు కెరటములవలన తుప్పరలు మిగుల నెత్తులేచును. అప్పుడప్పు డీజలబిందువులు వర్షమువలె కానవచ్చును. సముద్రమునందు తుపా నున్నయెడల నిట్టివి చూడనగును.

మేఘములు :- మేఘము లనేకవిధములు. వీటిలో కొన్నిటికి సిర్రసుమేఘములు (Cirrus), క్యూములను మేఘములు (Cumulus), స్ట్రేటసుమేఘములు (Stratus), సిర్రోక్యూములనుమేఘములు (Cirro Cumulus) క్యుములోస్ట్రేటసు మేఘములు (Cumulostratus), నింబసు (Nymbus) మేఘములు అందురు.

ప్రతిప్రదేశచిత్రమునందును మేఘములు ముఖ్యము. అందువలన వీటివిషయమై బాగుగ తెలిసి యుండవలెను. ఈమేఘములు మనుజులహృదయములయందు ఆశ్చర్యము నెలకొల్పును.వీటిని ప్రకృతి ననుసరించి చిత్రించుట నేర్చుకొనవలెను.