పుట:2015.393685.Umar-Kayyam.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

ఉమర్ ఖయ్యామ్

196

సుమములు పూచి, విచ్చి కడు సొంపులుగుల్కుచునున్నయట్టియీ
సమయముఁజార్పకే మధురసంబును ద్రావుము ; పెక్కునాళు లీ
సుమములు నిల్చి యుండ వటు చూచుచు నుండగ రాలి నేలపైఁ
గమరును ; మున్నె యేరికొనఁగాఁదగుఁ గాదె సరోజలోచనా !

197

ప్రేయసిలేని ప్రపంచము
గాయకతతి లేని వాద్యగణమును, సుఖమున్,
హాయియు, లేనివయస్సు వృ
థాయగు లోకప్రవృత్తిఁ దర్కించునెడన్.

198

నీ తపఃపుష్ప మిట వికసించి యుండ ;
నేల నీచేత మధుపాత్ర యెసఁగలేదు ?
మధువు త్రావుము ; తిరిగి యీ పథము రాదు
పొంచి యీకాల మెపుడొ వంచించు నిన్ను.

199

నెల యీయామినికొంగు చించి ధరణిన్ వీక్షించు నీరేయి వె
న్నెలలో శీధువు ద్రావు మిట్టితఱి రానే రాదు నీకింక నీ
నెల గోరీల వెలుంగువెన్నెల నొగిన్ నీరాంజనం బిచ్చెడిన్
గలకాలం బటుగాన నీవది యెఱుంగన్‌జాల వావంతయున్.