పుట:2015.393685.Umar-Kayyam.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

23

87

సోయగమున్, విలాసము, విశుద్ధమనంబుఁ, బ్రియం, బొయారమున్
బ్రాయము నింతయుండ ననురాగముఁబొందని స్వాంత మెంతయున్
ఱాయియొ రప్పయో యగును; రాగరసంబునఁదేలి యర్థియై
పోయి వరింపఁగాఁబడుటొ పొంగి వరించుటొ కర్జ మోర్తుకన్.

88

తేరగ నీవు మూలప్రకృతిన్ నిదురించెడు నన్ను లేపియున్
ధారుణి కేఁగి పేర్వడు మనన్ జనుదెంచితి నీ యనుజ్ఞనే
యీరభసంబుఁ జేసి తిట నేనిఁక దోషినె? నీటిపాత్రమున్
బోరలు వేసి నేలఁ బడఁబోవదు నీ రనునట్టు లుండదే.

89

విధినింద

ఓ విధి ! స్వతంత్రతను గల్గు నొకనికైన
మేలుఁ జేసితివా ? నీచపాళి కెపుడు
భాగ్యములఁ గూర్తు వెం తవిశ్వాసి వీవు
తెలివితేటలు నీ కింకఁ గలవె చెపుమ ?

90

తెలివితేటలచే నింత ఫలము లేదు
బుద్ధిహీనులకే సౌఖ్యములు ఘటించు
కాన యీ తెల్వి పోయెడు దాని నిండు !
ఇట్టులైనను విధి భాగ్య మిచ్చునేమో ?