పుట:2015.393685.Umar-Kayyam.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఉమర్ ఖయ్యామ్

59

ఈరేడు జగములందును
బేరును గడియించినట్టి విబుధులు గల రీ
ధారుణి వచ్చుచుఁ బోవుచుఁ
జేరరు దేవుని పదంబొ స్థిర శమపదమో!

60

త్రాగెడు పానపాత్ర యధరంబున ముట్టినవాని కిట్లనెన్
ఓగుణి! నాకు మున్ బెదవులుండెను; నీవలె నాశరీరమున్
భోగపరాయణత్వమునఁ బోయెను; దైవము మేలుచేసినన్
నీగతిగూడ నిట్టు లగు; నీవును నావలె నుందు వాపయిన్.

61

కుమ్మరి మట్తిని గాలన్
గ్రుమ్మఁగ నది చూచి వానిగూర్చి వచించెన్
గుమ్మరి నీవలె మును నే
నిమ్మహి మానవుఁడ; గౌరవింపుము నన్నున్.

62

పోయినవారు బూడి దయిపోయిరి; వారి శరీరలేశమం
దే యణువైనఁ గానఁబడ; దెట్టి సురన్ గొని మూర్ఛవోయి యా
కాయము వాసిరో ప్రళయకాలముదాఁక సుషుప్తిఁ జెంది రా
రాయెను; కర్మవాంఛఁ జనరాయెను వేనికి లెక్కసేయకే.