పుట:2015.393685.Umar-Kayyam.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ఉమర్ ఖయ్యామ్

668

నావిగ్రహము ధాత్రి నయ మొప్ప స్వయముగా
           జేసితి వే నేమి సేయఁగలను
నా తను వనుప్రత్తి నయ మొప్ప స్వయముగా
           వడికితి వేనేమి నుడువఁగలను
నా ముఖ ఫలకాన నయ మొప్ప స్వయముగా
           పాపపుణ్యంబులు పట్టి పట్టి
వ్రాసితి వవి నేఁడు చేసి చూపెడుదాఁకఁ
           బాయవు నే నెట్లు పాయఁగలను

హతవిధీ ! నేను స్వయముగా నవతరింప
లేదు లే ధీ వ్యధాభూమి మీఁది కీవె
చేసి పంపితి వే నేమి వేయఁగలను
ఏ నెవఁడను నెందుంటినొ యెపుడు గలనొ ?

669

ప్రతిదినమున్ బ్రభాతమును బాయక నే మధుశాల కేఁగి యం
చిత మనృతానులాపములఁ జిత్తము బుచ్చెద త్రాగుబోతులన్
హతవిధి ! సర్వమున్ సలుపునట్టి మహాత్ముఁడ వింకనైన నా
గతి సవరింపఁగావలదె కావఁగఁజెల్ల దె నిన్ను మ్రొక్కెదన్.

670

ఓ చెలి ! రమ్ము రమ్ము ! మదినుంచకు ఱేపటిచింత ; నేఁడె యే
దో చరితార్థమైన పదమొంది చరింపుము ; పాపపుణ్య సం
కోచము లెంచ ; కన్ని విధిగూర్చెడివే భయమేల ముందు నే
దో చరమాంగమందు వ్యధలుండు నటంచు వచింప నిక్కమే ?