పుట:2015.393685.Umar-Kayyam.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

135

530

ఓ సుమగాత్రి ! నావగ మహోగ్రతఁ దాల్చెఁ బ్రమత్తభావముల్
మోసులు నెత్తి నా చికురపూగము పండియెపోయెఁ గాని, వీ
వ్రాసినలేఖ యీ ముదుకవాలకమంతయు మార్చి నూతనో
ల్లాస వికాస భాసురవిలాసములన్ గడుఁ గూర్చె నెచ్చెలీ !

531

చెలి ! భవదాననంబు "జమషీదు" సుధాకలశంబు మించె ; నీ
తలఁపునఁ జచ్చుటే సుధను ద్రావుటకంటెను మేలు ; నీ పదం
బులఁ బడు ధూళి నాదుదినముల్ వెలుఁగొందగజేయుఁ ; దత్కళా
కలితరజంబులో లవముకాంతిలు కోటిరవిప్రకాశమై.

532

ఓ గజయాన ! నీదు నధరోష్ఠము కెంపులసొంపు నింపుఁ ; ద
ద్రాగవిచార మాత్మకు బలంబును, బ్రాణికి గ్రాస ; మెవ్వఁ డీ
రాగ మహానిలాబ్దములఁ బ్రాణమొసంగఁడొ వాఁడు "నూహునౌ
కాగృహ" మున్న జీవములు గల్గిన జచ్చినవాని పోల్కియే.

533

ఆహా ! నాప్రియ ! నీవిచార మెద లే, కావంత నిన్‌జూడ కీ
దేహం బోప దదేమొ ? నీపటమె మద్దీక్షాస్వరూపంబు ; సం
దేహం దేటికి దైవసాక్షిగను మచ్చి త్తంబులో నీవె, నా
యూహన్ నీవె మఱేకళంకమును లేకున్నావు వీక్షింపుమా !