పుట:2015.393685.Umar-Kayyam.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

81

318

అక్కట నీవు దగ్ధనరకాగ్నిని ప్రజ్వలనం బొనర్చుచోఁ
బొక్కుచు నెంతకాలము ప్రభో ! కరుణింపు మటంచు వేఁడుచున్
మ్రొక్కెద మిట్టు లీశ్వరునిమ్రోల పదంబడి యో ! యమర్‌ఖయా
మెక్కడనుండి వచ్చితివి యీశున కక్కటికంబు నేర్పఁగన్.

319

ఓసతి ! పానపాత్రల సముజ్జ్వల మద్యము నింపి తేవె ! యా
యాసవ మీ సభాసదుల కందఱకున్ బరమాత్మ దర్శనం
బే సమకూర్చుఁ గొంతవఱకేనియు ; నావల నాతఁడే ప్రసూ
నాసవ మిచ్చి ప్రోఁచు గలుషౌఘములన్ బరిమార్చి వేడుకన్.

320

ఆసవమున్, వధూటియు, వనాంతనివాసము మాకుఁ గూర్చి నీ
కోసము స్వర్గమున్ విలిచికొ మ్మటులైనను స్వర్గనారక
వ్యాసము లాలకింపుము స్వర్గమునుండి యెవండు వచ్చెఁ ? బె
న్దోసి యెవండు తన్నరకదుఃఖములోఁ బడిపోయెఁ జెప్పవే.

321

నిజభోగంబులె మిథ్య లన్న నిఁక సందేహాస్పదంబౌ తమో
ప్రజమున్ నమ్మి దినాలుపుచ్చుటకు నెవ్వాఁడోపు ? నే నీకరాం
బుజమం దాసవపాత్ర వీడను ; ననున్ మూర్ఖుం డటం చన్నచోఁ
బ్రజ మామైకము దెల్వి యొక్కటెగదా వాదేటి కెగ్గెంచఁగన్.