పుట:2015.392383.Kavi-Kokila.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

మలినమైనవి. నన్నీ యింట దింపిన పెద్దమనుష్యునికి బుద్ధి చెప్పించెదను. నేను రాజపుత్రుఁడనని యెఱుఁగక యిట్టి నికృష్టమైన విడిది యేర్పఱచి యుందురు.

లతీ : అరెతోబా ! ఈ యద్మీయింకా అదే లోకంలో వుండ్యాడ్! బందెఖానా అయా, యిది బందెఖానా - పిచ్చివయా.

రాజ : ఎచ్చటనో మాటయలుకుడు వినవచ్చుచున్నది. ఎవడురా అక్కడ? ఈయింటి యజమానుఁడెక్కడకు పోయెను. నన్ను పస్తు పెట్టఁదలంచెనా యేమి? ఏమి మొఱకుదనము! నాకిష్టమైన తినుబండములనైన అడిగి తెలిసికొనుటకు వంటవాఁడింకను రాఁడు.

లతీ : తినుబండాలూ - వంటవాడు వస్తాడ్ వస్తాడ్! సజ్జరొట్టె పప్పుపుల్సు తెస్తాడ్! అరె దివానా ఆద్మి!

రాజ : ఉక్క పుట్టి చెమటకాఱుచున్నది. సురటివేయు నౌకరి యైనఁలేడు. ఈరాత్రి గడచుటయె దుర్భరముగ నున్నది.

లతీ : ఒంటి స్తంబం మేడామె వుండి గాలీ బోజనంచేస్తావుండ్యాడ్ లాగా అనుకొంటుండ్యాడ్! లస్తర్లు, పట్టె మంచాలు, పరుపు దిండ్లూ, బోగం పిల్లా, బొమ్మాయిపిట్టా కావాల్నా శెప్పండి సర్కార్, తెప్పిస్తాన్. [నవ్వును]

రాజ : ఇచ్చట నెవ్వరును కాపురముండునట్లు కనిపించదు. నా కేదియో సందేహము పుట్టుచున్నది. దయ్యమునోటినుండి బ్రహ్మరక్షస్సు నొడిలో పడితినా? ఈ మూల మెట్లగపడుచున్నవి. ఎక్కడికి పోవునో చూచెదను. [పోఁబోయి వెనుకకుతగ్గి] అంధకార కూపమువలెనున్నది.

ఎంత వితర్కించినను నా కేమియుఁ దోఁచకున్నది. నన్నుఁగట్టితెచ్చిన వారును వారినుండి తప్పించి నన్నిచ్చటికిఁ గొనివచ్చి రేపుప్రొద్దుననే మా పట్టణమునకు పంపెదమని చెప్పిన కపటాత్ములును ఒక్క గూడెమువారేయై