పుట:2015.373190.Athma-Charitramu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా ? 61

మా సహపాఠి బజులుల్లాసాహేబు, మామువ్వురికిని మనసు గలిసినమిత్రుఁ డయ్యును, అన్యమతకూటస్థుఁ డగుటచేత, తగిన సానుభూతి చూపింపనేరక, మామనస్తాప మంతయు వట్టితాత్కాలికోద్రేక మని భావించి, మమ్ము పరిహసించుచు నొకచిన్న యాంగ్లేయ ప్రహసన మాదినములలోఁ గలిపించెను. భూమినుండి చంద్రునివఱకు నొకపెద్దవంతెన కట్టవలె నని యోజించెడి మువ్వురు ఉన్మత్తులతో మమ్మతఁడు పోల్చెను. పిచ్చియాలోచనలు చేయుచుండె నని రాజా కృష్ణారావునకు సత్యకాలప్రభు వనియు, చలచిత్తుఁ డని వెంకటరావునకు గాలిచక్ర మనియు, ఆవేశపూరితుఁడ నని నాకు భావోద్రేకమనియుఁ బేరులు పెట్టి, మామువ్వురిని తనప్రహసనమునఁ బాత్రలుగఁ జేసి యతఁడు వినోదించెను !

నా కీసమయమున సంఘసంస్కరణాభిమానులగు మిత్రు లిఁకఁ గొందఱు లభించిరి. వీరిలో నొకఁడు గోటేటి కనకరాజు. ఇతఁ డా సంవత్సరము ప్రథమశాస్త్రపరీక్షకుఁ బోయెడి విద్యార్థి. రాఁబోవుసంవత్సరమునందు ఉపాధ్యాయవృత్తిలోఁ బ్రవేశించి, తనహృదయమున కానందదాయకమగు ప్రార్థనసమాజాదేశముల చొప్పున ఋజువర్తనమున జీవితము నడపుకొనుట కీతఁ డుద్దేశించెను. ఇతనికంటె నదికాశాపరుఁ డగు వాఁడు ముత్తుస్వామిశాస్త్రి. ఈయన పట్టపరీక్షనిచ్చి, మహారాష్ట్రపాఠశాలను నడుపుచుండెడి విద్యాధికుఁడు. పెక్కుగ్రంథములను జదివి కొంత లోకానుభవము సమకూర్చుకొనిన ప్రజ్ఞావంతుఁడు. కాని, తాత్కాలికభావోద్రేకమునఁ గార్యరంగమునకు దుమికెడి వేగిరపాటువాఁ డనియు, చీటికి మాటికి మతము మార్చుకొను చుండెడి చంచలచిత్తుఁ డనియు, నీతనిని జనుల పరిహసించుచుండిరి. ఇందుఁ జాల సత్యము గల దని నాకును ద్యోతక మయ్యెను.