పుట:2015.373190.Athma-Charitramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా ? 59

శాస్త్రగ్రంథపరిశోధనము గావించి, అందలి యమూల్యసత్యములను ప్రజలకు బోధించుట విద్యాధికుల కర్తవ్యమని నాకుఁ దోఁచెను. ఇట్టి స్వచ్ఛందప్రచారకులలోఁ జేరుటకు నే నువ్విళు లూరితిని.

ఆనాఁడు సాయంకాలము రంగాచార్యులుగా రింకొక యుపన్యాస మొసంగిరి. ఇట్టియభిప్రాయమే ఆయనయు తన యుపన్యాసమున వ్యక్తపఱచిరి. మహారాష్ట్రపాఠశాలాధ్యక్షుఁడగు ముత్తుస్వామిశాస్త్రిగా రీసభలో, తన కిదివఱకుఁగల క్రైస్తవమతవిశ్వాసములను పరిత్యజించి, హిందూమతసీమకు పునరాగమముఁ జేయుచుంటి నని చెప్పివేసిరి ! నాసహాధ్యాయుఁ డొకఁ డంత లేచి, విద్యార్థులనీతి మతోద్ధరణమునకై పెద్దలు గట్టి కృషి సలుపవలె నని కోరెను. మఱునాఁటియుదయమున కళాశాలలో మిత్రులు నేనును మతసంస్కరణమునుగుఱించి ప్రసంగించితిమి. ఆసాయంకాలము రాజా కృష్ణారావుగారియింట మేము మరల కలసికొని యీవిషయమునుగుఱించి చర్చించితిమి. హిందూమతదౌర్బల్యమునకు ముఖ్య హేతువు, హిందూసంఘము శాఖోపశాఖలుగఁ జీలిపోవుటయే. కావున ప్రప్రథమమున చాతుర్వర్ణములలోఁగల యుపజాతులు తమతమ యంతర్భేదములను బాపుకొని యేకీభవించినచో, వేగమే దేశమున కైకమత్య మేర్పడఁగలదు. ఈసంగతిని మఱునాఁడు కళాశాలలోఁ జర్చింప మేము నిశ్చయించు కొంటిమి.

6 వ తేదీని రంగాచార్యులుగారు కర్మనుగుఱించి చేసినప్రసంగధోరణి నా కింపుగ లేదు. మఱునాఁడు మాతరగతిలోని విద్యార్థుల మందఱము కళాశాలలో సభ చేసి, చాతుర్వర్ణ్యములోని యుపశాఖల సమ్మేళన మెట్లొనఁగూడునా యని యాలోచించితిమి. మనలో నీసంఘీభావ మేర్పడెనేని, భారతీయు లందఱును సోదరబృందముగఁ