పుట:2015.373190.Athma-Charitramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. చర్వితచర్వణము 45

మణఁగిపోయెను. కళాశాలకుఁ బ్రాఁతకాఁపు నగుటచేత నన్ను తరగతికిఁ బెద్దగ నియమించిరి. ప్రాఁతమిత్రులను గుశలప్రశ్న చేయుచును, క్రొత్తవారి పరిచయభాగ్య మందుచును, నేను కళాశాలలో సుఖముగ నుంటిని.

ప్రవేశతరగతి యింకను దాటని కొండయ్యశాస్త్రి నా కిపుడును నిత్యసహవాసుఁడు. వెంకటరావు నాతరగతిలోనె యుండువాఁడు కావున, తఱచుగ నాతో నిష్టాగోష్ఠి నుండును. క్రొత్తగ స్నేహము కలిసినవారిలో ముఖ్యులు, పోలవరము జమీందారు రాజా కొచ్చర్లకోట వెంకటకృష్ణారావుగారు, మహమ్మదు బజులుల్లాసాహెబు గారును. ఆవేసవి సెలవులలో, బజులుల్లా వెంకటరావులు నావలెనే రాజమంద్రిలో నుండి, మేము క్రొత్తగాఁ గొనినస్థలములో వేసిన కుటీరమున నన్నుఁ గలసికొనుచుండువారు. ఏదో సాహిత్యవిషయమును గూర్చి మేము ప్రసంగించుచుండెడివారము. బజులుల్లాకు సాహిత్యాభిమానము మెండు. ఉర్దూభాషలోఁ దాను పద్యరచన చేయుచుందునని మాకుఁ జెప్పెడివాఁడు. ఇంగ్లీషులో నావలెనే యనేకపుస్తకములు చదివియుండెను. అతనికి డిక్వెన్సీయం దమితప్రీతి. అతని ప్రేరణముననే నే నపుడు ఆ రచయిత గ్రంథరాజమగు ""నల్ల మందుభాయి" యను పుస్తకమును వినోదమునఁ జదివితిని. కవులు కవిత్వము ననిన నాతఁడు చెవి కోసికొనువాఁడు. నే నావేసవిని డ్రైడను కోల్రిడ్జికవుల పద్యకావ్యములు, మూరుని "లాలారూకు" యును జదివితిని.

అప్పుడప్పుడు మేము షికారుపోవుచుండువారము. బొమ్మూరు కొండదగ్గఱకుఁ గాని, ధవళేశ్వరము ఆనకట్టయొద్దకుఁ గాని మేము నడచిపోయి, సృష్టివైచిత్ర్యములను కనుల కఱవు దీఱునట్టుగ వీక్షించు చుండువారము.