పుట:2015.373190.Athma-Charitramu.pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అనుబంధము 645

ఆపసివాని నగుమోము మరల నాకనులపండువు కాగలదా ?

మీరు వదెనయు, తమ్ముఁడు మఱదలును, ఇతరులును, ఆయర్భకుని గుఱించి యెంత శ్రమనొందిరి ! అన్నియు వృథయైపోయినవి. నేనెంత దురదృష్టవంతుఁడను !

అయ్యో, పాపము, మాలతి (కోడలు) సంగతియేమి? పలుమాఱు ఆమెనుగుఱించి నేను పలవించుచున్నాను ! నావలెనే యామెయు దురదృష్టవంతురాలయ్యెను. నిరపరాధినియగు ఆబాలప్రార్థనలనైన పరమాత్ముఁ డాలకింపలేదే !

రా. వెంకటరామయ్య.

(25)

వెల్లూరు చెఱసాల, 19-8-32

మిత్రవర్యా, నమస్కారములు. * * ఇక్కడ వర్షములు కొద్దికొద్దిగ అప్పుడప్పుడు కురియుచున్నవి. సౌఖ్యముగను ఆరోగ్యముగను నున్నది. కాలము చక్కగనే గడచిపోవుచున్నది. ఏదియైన వ్రాయుటకు తగినంత యుత్సాహముగాని శక్తిగాని నాకు కనుబడుటలేదు. ఏదియో చదువుచు కాలక్షేపము చేయుచున్నాను. ఇచ్చట అందఱును గ్రంథకాలక్షేపము చేయుచున్నారు. కొందరు గ్రంథరచనలును చేయుచున్నారు. ఇదియంతయు నొక్క విద్యార్థి కూటమువలె నున్నది. గొప్పవిద్యార్థి వసతిగృహమని చెప్పవచ్చును. అందరును చాలవఱకు కాలమేమియు వ్యర్థముచేయక, యేదియోనొక పరిశ్రమ చేయుచునే యున్నారు.

కొండ వెంకటప్పయ్య.