పుట:2015.373190.Athma-Charitramu.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. హరిజనోద్యమము 617

నేను నవంబరు 18 వ తేదీని బెజవాడవెళ్లి, అక్కడనుండి శ్రీ నాగేశ్వరరావుపంతులుగారితో ఏలూరుపోయితిని. బెజవాడకు 19 వ తేదీ యుదయమునకు వచ్చిన ఆంధ్రవిశ్వవిద్యాలయ వైసుచాన్సెలరుగారగు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారితోఁ గలసి మాట్లాడితిని. ఏలూరులో "ఆంధ్ర హరిజన సేవాసమితి" వారి కార్యనిర్వహకసభకుఁ బోయితిని. ఆసాయంకాలము ఏలూరులో జరిగిన బహిరంగసభలో మిత్రులతో నేనును "అస్పృశ్యతానివారణమును" గుఱించి యుపన్యసించితిని.

శ్రీ నాగేశ్వరరావుగారు నా "ఆత్మచరిత్రమును" తమ యాంధ్రగ్రంథమాలా కుసుమములో నొకటిగా స్వీకరించి ముద్రింతు మనిచెప్పిరి. వారికోరికమీఁద "ఆంధ్రపత్రిక" కు క్రొత్తవ్యాసములు వ్రాయుదునని పలికితిని.

"నా పూర్వపరిచితులు" అను శీర్షికతో నే నంతట కొన్ని వ్యాసములు "ఆంధ్రపత్రిక"కు వ్రాయ నిశ్చయించుకొని, వేదము వెంకటాచలయ్య, మన్నవ బుచ్చయ్యపంతులు మున్నగువారల సంగ్రహ జీవితములు వ్రాసి, ఆంధ్రపత్రికలో ముద్రింపించితిని.

"ఆంధ్రహరిజనసేవాసమితి" ప్రచారకవర్గమునుండి పిలుపురాఁగా, నేను నవంబరు 27 వ తేదీని గుడివాడవెళ్లి, అచ్చట 28 వ తేదీని, ఆ మఱునాఁడు బందరులోను, మూఁడవరోజున చవటపాలెములోను జరిగిన సభలలోఁ బాల్గొంటిని. ఇట్లు విశ్రాంతి ననుభవించుచుండు నేను, పరిస్థితులప్రభావమున వ్యాసములు వ్రాయుటకును, ఉపన్యాసము లిచ్చుటకును బూనుకొని, దేశాటనమునకుఁ గడంగితిని. ఇట్లే ఆ డిశంబరు 9 వ తేది మొదలు 17 వఱకును నేను పై సమాజ ప్రచారకవర్గముతోఁగూడి విశాఘపట్టణము, చోడవరము, అనకా