పుట:2015.373190.Athma-Charitramu.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. హరిజనోద్యమము 615

వారలచే తాకించిరి. కొన్నిగృహముల కంటియుండు నూతులుకూడ యజమానుల యంగీకారముచే పంచములు స్పృశించిరి. మాబావికిఁ గూడ నీభాగ్యము పట్టెను !

ఆమఱునాఁడు గుంటూరు మైదానమున జరిగిన "అస్పృశ్యతా నివారణసభ" కనేకులు వచ్చిరి. నన్ను మరల నగ్రాసనాసీనునిఁ జేసిరి. ఈ సంస్కరణమునుగుఱించి ప్రస్తుతపుసంగతులు నేను విరళముగఁ జెప్పితిని. ఈరెండుదినములును నిరశనవ్రతము సలుపుచుండు ఉన్నవ లక్ష్మీనారాయణగారు తీవ్రముగ మాటాడిరి. సభికులు మిక్కిలి యుత్సాహముతో నుండిరి.

ఇంకఁ గొన్ని దినములపిమ్మట "పురపాలకపుస్తకాలయము"న జరిగిన సభలో "గుంటూరుమండల హరిజనసేవాసమితి" యేర్పడెను. ఈ సమితికి నన్ను అధ్యక్షునిగను, శ్రీయుత కొల్లి సత్యనారాయణ మల్లాది యజ్ఞనారాయణశాస్త్రిగార్లను కార్యదర్శులగను నియమించిరి. అప్పటినుండియు మాసంఘ యాజమాన్యమున జరిగిన బహిరంగసభలలో నేను అస్పృశ్యతానివారణమును గూర్చి తఱచుగ మాట్లాడుచు వచ్చితిని.

అక్టోబరు 9 వ తేదీని బెజవాడలో శ్రీ న్యాపతి సుబ్బారావుగారి యాధిపత్యమున జరిగిన మహాసభలో "ఆంధ్రహరిజనసేవా సంఘసమితి" నెలకొల్పఁబడెను. దానికి దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారు అధ్యక్షులుగను, మాగంటి బాపినీడు గారు మున్నగు ముగ్గురు కార్యదర్శులుగను ఏర్పడిరి. కార్యనిర్వాహకసభలో సభ్యునిగను, సమితి ప్రచారకులలో నొకనినిగను నన్ను గోరుకొనిరి.