పుట:2015.373190.Athma-Charitramu.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అకాలమరణము 607

దివంగతుఁడయిన మా సూర్యనారాయణుని కంకితముచేసి, యొకింత దు:ఖోపశాంతి గాంచితిని. పుస్తకముఖపత్రమున వీరేశలింగముగారి ఛాయాపటముతోఁబాటు సూర్యనారాయణుని చిత్రమును ముద్రితమయ్యెను. అందలి కృతిపద్యము లిచటఁ బొందుపఱుచుచున్నాఁడను.

                ఆ-వె. "కాశిచేరి గంగఁ గాంచనియాత్రయు
                        మోకఁబెంచి ఫలము తాఁకనికృషి
                        అయ్యె, వ్యర్థమయ్యె నల్పాయువుంజేసి
                        నీదు విద్య సుగుణ నికరమయ్యొ !

                    క. కొనుమా యంకితమిది మన
                        యనురాగ శ్రీకొకింత యంకితముసుమీ,
                        తునుమాడి భూనిగళములఁ
                        గనుమా పరమాత్ము పద సుఖమ్ముల సూరీ !"

నాబాల్యస్నేహితులు, కవిపుంగవులునగు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహముగా రీపుస్తకమునకుఁ దొలిపలుకు వ్రాసిరి.

ఎట్టకేల కీపుస్తకము ముద్రాలయమునుండి వెలువడుటకు నేను సంతోషించుచుండఁగా, మాచెల్లెలు కనకమ్మకు నంజు కనఁబడెనని మాతమ్ముఁడు ఏప్రిలునెలలో నాకు భీమవరమునుండి వ్రాసెను. కావున నేనామెను జూచుటకు భీమవరము వెళ్లితిని. దైవానుగ్రహమున నామెకు నానాట స్వస్థపడెను.

1931 ఏప్రిలునెలలో "పశ్చిమ గోదావరిమండల యున్నత పాఠాశాలల బోధకులసమాజ" వార్షిక సభ ఉండిలో జరిగెను. ఆసభకు నే నధ్యక్షత వహించితిని.