పుట:2015.373190.Athma-Charitramu.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 602

మా మేనల్లుని పెండ్లినిగుఱించి మా చెల్లెలుచేసిన యప్పు నేనిపుడు తీర్చి వేసితిని. ఇంతలో ధాన్యపుధర యాకస్మికముగ తగ్గిపోవుటచేత, ఆర్థికకష్టములకులో నగు నేను, అనుకొనినట్టుగ వెంటనే మాచెల్లెలి కింకను ధనసాహాయ్యముఁ జేయ లేక పోయితిని.

1930 వేసవి చివరను సూర్యనారాయణయు నేనును మాయత్తవారియూరగు వెలిచేరు పయనమయితిమి. మా మేనమామ వెంకయ్యగా రాక్రిందటిదినమె వేలివెన్నులో నాకస్మికమరణము నొంది రని దారిలో నిడదవోలులో మాకు దు:ఖవార్త తెలియుటచేత, మే మపుడు వేలివెన్నువెళ్లితిమి. మా మేనమామ చిన్న నాఁటి నుండి మా సోదరుల నెంతోప్రేమతోఁజూచి, మా విద్యాభివృద్ధికిఁ దోడుపడిరి. చాలకాలము జీవించి, యిపుడనాయాసమరణమునొందిన వెంకయ్యగారు ధన్యజీవితుఁడు. రెండునెలలక్రిందటనె యీయన తన రెండవకుమారునికి వివాహముచేసిరి. నాయాలోచన ననుసరించి యాయన పెద్దకుమారుఁడు రాజమంద్రిలో రెండుసంవత్సరములు బోధనాభ్యసనము చేసి, యిటీవలనె విద్యాబోధకుఁ డయ్యెను.

మేమంత వెలిచేరు నడిచి వెళ్లితిమి. మాబావమఱఁది కుటుంబమువారినందఱినిజూచి, సూర్యనారాయణునిభార్య మాలతిని మావెంటఁబెట్టుకొని, రాజమంద్రిమీఁదుగ మేము భీమవరము చేరితిమి.

నేను మరల జులై నెలలో గుంటూరు వెడలిపోయితిని. నాభార్య యీ లోపుగ బెంగుళూరునుండి వచ్చెను. ఉన్నవ దంపతులు సత్యాగ్రహమునఁ బాల్గొని కారాగారమున కేగుటచేత, వారుజరుపు "శారదనికేతన" పాలకవర్గములో నే నొకఁడనయితిని. కాని, వారివలె మే మెవరమును పనిచేయఁ జాలకుంటిమి. సెప్టెంబరులో